iDreamPost
android-app
ios-app

Magunta- ప్రకాశం పై చెరగని సంతకం.. మాగుంట సుబ్బరామిరెడ్డి

Magunta- ప్రకాశం పై చెరగని సంతకం.. మాగుంట సుబ్బరామిరెడ్డి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాజకీయంగా రాణించారు. వారందరిలో ప్రత్యేకమైన వ్యక్తి దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి. ఎంపీగా పని చేసింది ఒక్కసారైనా.. తన సేవా కార్యక్రమాలతో ప్రకాశం జిల్లాపై చెరగని ముద్ర వేశారు. తరం మారినా.. మాగుంట సుబ్బరామిరెడ్డిని ప్రకాశం జిల్లా ప్రజలు నేటికీ తలుచుకుంటున్నారంటే.. ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు (డిసెంబర్‌ 1) మాగుంట 26వ వర్థంతి సందర్భంగా మరోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఆయన్ను స్మరించుకుంటున్నారు.

1947 నవంబర్‌ 26వ తేదీన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పేడూరు గ్రామానికి చెందిన మాగుంట రాఘవరెడ్డి, కౌసల్యమ్మలకు తొలి సంతానంగా సుబ్బరామిరెడ్డి జన్మించారు. ఆయనకు సుధాకర్‌ రెడ్డి, సుహాసనమ్మ, శ్రీనివాసుల రెడ్డిలు తమ్ముళ్లు, చెల్లెలు ఉన్నారు. సుబ్బరామిరెడ్డి రాజకీయ వారసత్వాన్ని శ్రీనివాసుల రెడ్డి కొనసాగిస్తుండగా.. మిగతా వారు వ్యాపార రంగంలో ఉన్నారు.

పేడూరులో ప్రాథమిక విద్యనభ్యసించిన సుబ్బరామిరెడ్డి, నెల్లూరు వెంకటగిరి రాజా (వీఆర్‌) హైస్కూల్, జూనియర్‌ కాలేజీల్లో తదుపరి విద్యను అభ్యసించారు. 1963 కర్ణాటకలోని తుంకూరులో ఇంజనీరింగ్‌లో చేరిన సుబ్బరామిరెడ్డి.. 1965తో తండ్రి రాఘవరెడ్డి మరణంతో విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబం, వ్యాపార బాధ్యతలను 18 ఏళ్ల వయస్సులోనే తన భుజస్కంధాలపై వేసుకున్న సుబ్బరామిరెడ్డి.. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. తండ్రి పేరుతో చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. జిల్లా అంతటా చేసిన సేవా కార్యక్రమాల ద్వారా అనతికాలంలోనే తన కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌ రెడ్డి సోదరుడు రామిరెడ్డి కుమార్తె పార్వతమ్మను 1967 ఫిబ్రవరి 19వ తేదీన వివాహం చేసుకున్నారు. వారికి విజయ్‌ రెడ్డి, మాలిని అనే ఇద్దరు పిల్లలున్నారు.

సినిమా థియేటర్లు, ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ఉక్కు కర్మాగారాలు, ఆక్వా పరిశ్రమలు, షిప్పింగ్, డిస్టలరీలు, స్టార్‌ హోటల్‌.. ఇలా అనేక వ్యాపారాలు పలు రాష్ట్రాలలో చేసిన మాగుంట సుబ్బరామిరెడ్డి కేవలం 20 ఏళ్లలోనే దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు.

నెల్లూరు జిల్లాకే చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్‌ రెడ్డి ప్రోత్సాహంతో, దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ   ఆశీస్సులతో సుబ్బరామిరెడ్డి 1991లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తనకు ఎలాంటి పరిచయాలు లేని ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ టిక్కెట్‌ కేటాయించగా.. పార్టీ ఆదేశాలతో పోటీ చేసేందుకు వెళ్లారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట కిలోమీటర్ల మేర వచ్చిన వాహన ర్యాలీ.. అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. స్థానికేతరుడైనా తక్కువ కాలంలోనే లోక్‌సభ పరిధిలోని గ్రామాలు, పట్టణాలలో పర్యటించి.. ప్రజల కష్టాలు, బాధలు తెలుకుని అండగా ఉంటాననే హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ ప్రభంజనం వీస్తున్నా.. ప్రజల మన్ననలు మాగుంట పొందారు. లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు.

Also Read : YSR Aarogyasri Scheme – ఎగువ మధ్య తరగతికి ఆరోగ్యశ్రీ.. పరిమితిని పెంచిన జగన్ సర్కార్

లోక్‌సభ సభ్యుడంటే.. ప్రజలకు కనిపించరనే సంప్రదాయానికి సుబ్బరామిరెడ్డి ఫుల్‌స్టాఫ్‌ పెట్టారు. ఒంగోలులో ఇళ్లు నిర్మించుకుని.. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల వేళ ప్రజల కష్టాలను చూసిన మాగుంట.. ఓ పక్క ప్రభుత్వ నిధులతో వారి కష్టాలను తీరుస్తూనే.. మరో పక్క మాగుంట చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి.. విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరువు, ఫ్లోరోసిస్‌కు నిలయమైన పశ్చిమ ప్రకాశం జిల్లాలోని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. విద్యకు పెద్దపీట వేశారు. ఎంఎస్‌ఆర్‌ (మాగుంట సుబ్బరామిరెడ్డి) పేరుతో జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యాదాతగా పేరొందారు. గుడులు, మసీదులు, చర్చిల నిర్మాణం, దానాలు, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి అవకాశాలు.. ఇలా సుబ్బరామిరెడ్డి సేవలు అనన్యమైనవి.

44వ వడిలో లోక్‌సభలో అడుగుపెట్టిన సుబ్బరామిరెడ్డి.. దేశ ఆర్థిక పరిస్థితి, సంస్కరణలపై చేసిన ప్రసంగం అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్‌మోహన్‌ సింగ్‌లను ఆకట్టుకుంది. తన మేధోశక్తి, రాజకీయ చతురతతో తక్కువ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, పార్టీ కోసం చేస్తున్న కృషితో సోనియా గాంధీకి సన్నిహితుడుగా మారారు. 1992లో కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం అప్పజెప్పిన తిరుపతి ప్లీనరీని విజయవంతం చేసి పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పీసీపీ కోశాధికారిగా పార్టీ బాధ్యతలను, నియోజకవర్గ అభివృద్ధి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ బలమైన నేతగా ఎదుగుతున్నారు. ఈ తరుణంలో 1995 డిసెంబర్‌ 1వ తేదీన ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో ముచ్చటిస్తున్న సమయంలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో సుబ్బరామిరెడ్డి మృతి చెందారు.

సుబ్బరామిరెడ్డి తర్వాత.. 1996లో ఆయన సతీమణి పార్వతమ్మ ఒంగోలు లోక్‌సభ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో ఒంగోలు లోక్‌సభ నుంచి సుబ్బరామిరెడ్డి చిన్న తమ్ముడు శ్రీనివాసుల రెడ్డి పోటీ చేసి గెలిచారు. 1998, 2004, 2009లలో కాంగ్రెస్‌పార్టీ తరఫున, 2019లో వైసీపీ తరఫున శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పిల్లలు వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. మాగుంట రాజకీయ వారసత్వాన్ని తమ్ముడు శ్రీనివాసుల రెడ్డి కొనసాగిస్తున్నారు. శ్రీనివాసుల రెడ్డి తన తర్వాత.. తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయాల్లో తీసుకురావాలని ఆశిస్తున్నారు. ఇప్పటి నుంచే రాఘవరెడ్డిని ఆ దిశగా నడిపిస్తున్నారు.

Alos Read : Mandapeta – మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు మృతి…