Idream media
Idream media
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు పేరుకే ఉపఎన్నికలు కానీ ఓ మహా సంగ్రామాన్ని తలపించాయి. ఉప ఎన్నికల ఫలితాలలో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతోతారాజువ్వల దూసుకెళ్లింది. కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుతో కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి గద్దెనెక్కినప్పటికీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉండగా అధికారం నిలుపుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 116.కాగా ఉపఎన్నికలకు ముందు బీజేపీకి 107, కాంగ్రెస్ 87 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ నేపథ్యంలో తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఉప ఎన్నికలలో ఖచ్చితంగా 8 సీట్లలో గెలిచి తీరాల్సిన పరిస్థితి బీజేపీ పార్టీది. కాగా ఉప ఎన్నికలలో బీజేపీ 19 స్థానాలు గెలవడంతో శివరాజ్‌సింగ్ సర్కార్‌కు ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది.
గ్వాలియర్‌పై సడలిన జ్యోతిరాదిత్య పట్టు
2018 అసెంబ్లీ ఎన్నికలకి ముందు సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ని అధికార పీఠానికి దగ్గర చేయడంలో జ్యోతిరాదిత్య సింధియా కీలక పాత్ర వహించారు. ఆనాటి ఎన్నికలలో జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌కి అన్నీ తానై రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తూ తన ప్రచారంతో హోరెత్తించారు. 2018 ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ ఆయనకు హ్యాండ్ ఇచ్చి సీనియర్ నేత కమలనాథ్ ను ముఖ్యమంత్రిగా చేసింది.ఈ నేపథ్యంలో ఏడాదిపాటు కీలక పదవి కోసం ఆయన వేచి చూశారు.ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించిన గ్వాలియర్ యువరాజు సింధియాకి కాంగ్రెస్ మొండి చేయి చూపింది.
ఇక కాంగ్రెస్‌లో తనకు భవిష్యత్ లేదని భావించిన జ్యోతిరాదిత్య తన మద్దతుదారులైన 22 ఎమ్మెల్యేలతో గత మార్చిలో బీజేపీ గూటికి చేరారు.తనపై నమ్మకంతో బీజేపీ తీర్థం పుచ్చుకొని శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరినీ ఉప ఎన్నికలలో గెలిపించుకోవాల్సిన బాధ్యత జ్యోతిరాదిత్య భుజాలపై బీజేపీ అధిష్టానం మోపింది.దీంతో ఉప ఎన్నికలు జరుగుతున్న మొత్తం 28 స్థానాలలో చంబల్ లోయ ప్రాంతంలోని 22 స్థానాలను గెలవాల్సిన పరిస్థితి ఆయనకి ఎదురైంది. ఇందులో సింధియా రాజవంశానికి చెందిన గ్వాలియర్ జిల్లాలలో 16 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన మద్దతుదారుల గెలుపు నల్లేరు మీద నడకే అని అందరూ భావించారు. కానీ తనను నమ్మి కాంగ్రెస్‌ని వీడిన 22 మంది మాజీ ఎమ్మెల్యేలలో 17 మందిని మాత్రమే జ్యోతిరాదిత్య గెలిపించుకోగలిగారు.గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో 5 మంది తన మద్దతుదారులు ఓటమి పాలవడం సింధియాకు రాజకీయంగా కొంత ఎదురు దెబ్బగా చెప్పవచ్చు.
కాగా మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలలో తన మద్దతుదారుల గెలుపు కోసం జ్యోతిరాదిత్య అన్ని తానై చెమటోడ్చిచారు. ఆయన కమలం చెంతకు చేరినప్పుడు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు ఇప్పటివరకు నిజం కాలేదు. ఉప ఎన్నికలలో పూర్తిస్థాయిలో సత్తా చాటక పోయినప్పటికీ బీజేపీ అధికారం నిలపడంలో ఆయన విజయవంతం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయనకి త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రాధాన్యత శాఖ దొరుకుతుందా లేదో వేచి చూడాలి.
కాంగ్రెస్ ఆశలు గల్లంతు
తాజా సమాచారం మేరకు మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లాయి. ఉప ఎన్నికలలో భారీ విజయం సాధించి రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమల్‌నాథ్ చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి. మధ్యప్రదేశ్‌లో తిరిగి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలంటే కాంగ్రెస్ కనీసం 22 స్థానాలను కైవసం చేసుకోవలసి ఉంది. కాగా ఉప ఎన్నికలు జరిగిన 28 నియోజకవర్గాలలో కాంగ్రెస్ కేవలం 8 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఇక మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిని మాజీ సీఎం,పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ అంగీకరించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలోని మొత్తం 58 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో 40 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.గుజరాత్ (8),కర్ణాటక(2) లో ఉప ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాలని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే ఉప ఎన్నికలు జరిగిన ఏడు సీట్లలో ఆరింటిని గెలిచి బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.ఇక మణిపూర్‌లోని 4 స్థానాలకు గాను మూడింటిని గెలిచిన బిజెపి ఒక స్థానంలో ఆధిక్యతలో ఉంది.