Idream media
Idream media
నాలుగు పాటలు, రెండు ఫైట్స్, సెంటిమెంట్, మారువేషాలతో వెళుతున్న తెలుగు సినిమాని అభ్యుదయం దారి మళ్లించిన నటుడు మాదాల రంగారావు. మొదట్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. విజయనిర్మల డైరెక్ట్ చేసిన శంకుతీర్థంలో చిన్న విలన్‌గా వేశారు. 1980 సొంత బ్యానర్‌తో యువతరం కదిలింది తీసారు. దానికి మొదట వి.మధుసూధనరావు డైరెక్టర్. అయితే మాదాలకి ఆయనకి ఎక్కడో చెడింది. మాదాల దగ్గర డబ్బులు లేవని, అనవసరంగా తన టైమ్ వేస్ట్ చేస్తున్నాడని మధుసూధనరావు కంప్లయింట్. అదేం కాదని ఆయన గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడని, ఒకరోజు స్కూటర్‌లో తీసుకెళితే ఇగో దెబ్బతిందని రంగారావు ఆరోపించారు. మొత్తానికి సినిమా ఆగిపోయి ధవళ సత్యం డైరెక్టరయ్యారు. సినిమా హిట్.
1980లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా పాలిస్తూ వుంది. ప్రతి టవున్‌లో గ్రూప్‌లు, తగాదాలు. రౌడీమూకలు, దౌర్జన్యాలు. యువత బాగా విసిగిపోయి వుంది. సామాజిక రాజకీయ పరిస్థితులపై సినిమాలు తీసేవాళ్లు లేరు. అప్పుడప్పుడు ఒకటో రెండో వచ్చినా అవి ఆర్ట్ సినిమాల్లా వుండేవి. ఈ నేపథ్యంలో యువతరం కదిలింది జనానికి ఎక్కింది. తరువాత ఎర్రమల్లెలు సూపర్‌హిట్. నాంపల్లి టేసనుకాడ పాట అన్ని వూర్లలో మార్మోగింది. మాదాలకి ఎంత క్రేజ్ అంటే అనంతపురంలో ఎర్రమల్లెలు డబుల్ థియేటర్ వేశారు. ఆ రోజుల్లో (1981) పెద్ద హీరోల సినిమాలే డబుల్ థియేటర్. మాదాల దాన్ని బ్రేక్ చేశాడు. ఈ వూపులో ఆయన చాలా సినిమాలు చేశాడు. అవన్నీ ఒకే మూసగా రావడంతో జనానికి బోర్ కొట్టింది. మహాప్రస్థానం సినిమాలో శ్రీశ్రీ నటించినట్టు గుర్తు.
అయితే రంగారావు వేసిన బాట వూరికే పోలేదు. దాన్ని టి.కృష్ణ (హీరో గోపిచంద్ తండ్రి) అందుకున్నాడు. ప్రతిఘటన పెద్ద హిట్. ప్రతి వూళ్లో ఒక రౌడీ వున్న కాలంలో జనం ఈ సినిమాలో తమ వూరి రౌడీని చూసుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి స్పెషల్ షోలు వేసే స్థాయికి వచ్చింది. రామోజీరావు ఇంత పెద్ద హిట్‌ని మళ్లీ తీయలేకపోయాడు. ఆ రోజుల్లో కలెక్షన్ చెక్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో రెప్రజెంటేటివ్స్ వుండేవాళ్లు. ఈ సినిమాలో మిగుల్చుకున్న డబ్బుతో ఇల్లు కట్టుకున్నారని చెప్పుకునేవాళ్లు.
టి.కృష్ణ తరువాత ఆ మార్గాన్ని నారాయణమూర్తి ఎంచుకున్నారు. నటించింది తక్కువ సినిమాలే అయినా మాదాల ఒక ట్రెండ్ సృష్టించారు. మే 27 ఆయన వర్ధంతి.