Idream media
Idream media
సినిమా వాళ్లు ఏదీ ఊరికే ఇవ్వరు. వినోదం కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) పేరుతో బోలెడు వినోదం పంచారు.
1.ఈ ఎన్నికల వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. టికెట్ల రేట్లు తగ్గవు. సినిమాల నాణ్యత పెరగదు. మంచు విష్ణు ఎంపిక వల్ల పెత్తందారీతనం పెరగదు. అది ఆల్రెడీ ఇండస్ట్రీలో కావాల్సినంత ఉంది.
2.ఒక వేళ ప్రకాశ్‌రాజ్ గెలిచినా సినీ పరిశ్రమలో ప్రజాస్వామ్యం వెల్లి విరియదు. అందరూ కలిసి ప్రకాశ్‌రాజ్‌ని కార్నర్ చేసే వాళ్లు. ఆయనకి BP పెరిగి నోటికొచ్చింది తిట్టేవాడు.
3.కొడుకు మీద ప్రేమ మోహన్‌బాబులోని సహజ నటున్ని తొక్కేసింది. ఆవేశంగా తిట్ల పురాణం విప్పుతాడనుకుంటే , మౌనం వహించి విజయం సాధించాడు. ఈ ఎత్తుగడ ఆర్థం కాక ప్రకాశ్‌రాజ్ నోరు విప్పాడు. పవన్‌కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్‌తో విష్ణు సినిమా బడ్జెట్ సమానం కాదన్నాడు. ప్రకాశ్‌రాజ్ కూడా చిన్న నటుడిగానే వచ్చాడు. ఒకరోజులో పెద్ద నటుడు కాలేదు. అయినా మా లీడర్‌షిప్‌కి, కలెక్షన్లకి ఏంటో సంబంధం?
4.ఎన్నికల్లో కాన్వాస్ కంటే కరవడం ముఖ్యమని హేమ నిరూపించారు. ఈ స్పెషాలిటీ వల్ల వచ్చే ఎన్నికల్లో ఆమె ఏదో ఒక పార్టీ ద్వారా పోటీ చేయొచ్చు. వేదాంతం కంటే దంతం ఎపుడూ గొప్పది. చరిత్రలో కరవడం ద్వారా నాయకులైన వాళ్లు ఎందరో ఉన్నారు.
Also Read : నిన్న నాగబాబు నేడు ప్రకాష్ రాజ్ గుడ్ బై
5.దేశభక్తి, దైవభక్తి లేనివాళ్లకి ఓటు వద్దు అన్నారు. సంబంధం లేకుండా మాట్లాడ్డం పాలిటిక్స్ ప్రాథమిక లక్షణం. “మా” అది సాధించింది.
6. “మా”కి సొంత భవనం , ఇదో ప్రధాన అంశం. సొంత బిల్డింగ్ వల్ల పేద నటులకి ఏంటి ప్రయోజనం? ఇళ్లు లేని వాళ్లని ఉచితంగా ఉండనిస్తారా?
7.సొంత నిధులు, ఆదాయ వనరులు లేని సంఘానికి ఇంత గోల, ఇన్ని హామీలు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు.
8.నాగబాబుతో అర్జెంట్‌గా తూనికలు, కొలతలపై పరిశోధన చేయించాలి. ఎవరెంత నటులో తూకం వేసే పనిలో ఉన్నారు. ప్రకాశ్‌రాజ్ కాలి గోటికి కూడా సరిపోని నటుల జాబితా తయారీ ఆయనకి అప్పగించాలి.
9.గౌరీలంకేశ్ హత్యపై నోరు విప్పిన వ్యక్తిగా ప్రకాశ్‌రాజ్‌పై అందరికీ గౌరవం. కానీ ఈ ఎన్నికలతో బ్యాలెన్స్ లేని వ్యక్తిగా గుర్తింపు పొందాడు. నటనలో ప్రకాశ్ గొప్పవాడే కావచ్చు. “మా” ఎన్నికల వరకూ మంచు విష్ణునే మెచ్యూర్టీతో వ్యవహరించాడు.
10.కరోనా కష్టకాలంలో “మా” ఏదో మొక్కుబడి సాయమే చేసింది. గట్టిగా నిలబడిందేమీ లేదు. అత్యంత గడ్డు కాలంలో పనికి రాని “మా” గురించి నరేష్ జాతీయ స్థాయి బిల్డప్‌తో మాట్లాడ్డం అతిపెద్ద కామెడీ. చివరిగా రెండు పిల్లుల మధ్య కోతి లాభం పొందినట్టు టీవీల వాళ్లు రేటింగ్ పెంచుకున్నారు. న్యూస్ కోసం వాళ్లు విసిరిన ట్రాప్‌లో నటులు చిక్కుకుని అడ్డగోలుగా మాట్లాడారు.
నిజానికి అంతిమంగా విజయం సాధించింది మీడియానే. ఎంత మేత కూడా చాలనంత ఆకలి వాళ్లకి.
Also Read : పాపం అనసూయ.. నిజంగానే ఓడిందా ?గోల్ మాల్ జరిగిందా ?