iDreamPost
android-app
ios-app

L.Ramana – ఎల్. ర‌మ‌ణ ప‌ద‌వి సాధించారు.. రికార్డు సృష్టించారు..!

L.Ramana – ఎల్. ర‌మ‌ణ ప‌ద‌వి సాధించారు.. రికార్డు సృష్టించారు..!

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కూడా తెలంగాణ‌లో టీడీపీలో కొన‌సాగి న‌ష్ట‌పోయిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే అది ఎల్ . ర‌మ‌ణే. ఇక్క‌డ ఆ పార్టీకి కాలం చెల్లిపోయింద‌ని తెలిసిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ప్ర‌తీ ఎన్నిక‌లోనూ పోటీ చేసి అప‌జ‌యాల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. చివ‌ర‌కు తీవ్ర త‌ర్జ‌న‌మేర‌కు కొన్ని నెల‌ల క్రితం అధికార‌పార్టీ టీఆర్ ఎస్ లోకి చేరారు. త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు ఆయ‌న‌ను ఎమ్మెల్సీని చేశారు. కాగా, శాసనమండలి ఎన్నికలో గెలుపొందిన ఎల్ రమణ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి మూడు చట్ట సభల్లో గెలిచిన వ్యక్తిగా రికార్డులకెక్కారు.

పార్లమెంటు మెంబర్గా, శాసనసభ సభ్యుడిగా, ఇప్పుడు శాసన మండలి సభ్యుడిగా.. ఇలా మూడు చట్ట సభల్లో అడుగుపెట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన ఎల్ రమణకు ఇటీవల కాలం కలిసి రాలేదు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి,రమణకు రాజకీయ పరంగా దశాబ్దాల వైరం ఉంది. ఇరువురు పరస్పరం పోటీ చేస్తే జీవన్ రెడ్డి నాలుగు సార్లు, రమణ రెండు సార్లు గెలిచారు. రమణ చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏపీ తెలంగాణకు రెండు శాఖలకు ఇద్దరు అధ్యక్షులను నియమించారు చంద్రబాబు.

ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. ఏపీకి కళా వెంకట్రావును.. తెలంగాణకు ఎల్ రమణను అధ్యక్షులుగా నియమించారు. అయితే ఎల్ రమణ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. టీడీపీని టీఆర్ఎస్ భర్తీ చేయడంతో ఎల్ రమణ కూడా ఏమీ చేయలేకపోయారు.

మహామహులంతా పార్టీని వీడినా రమణ మాత్రం చంద్రబాబునే అంటిపెట్టుకుని ఉన్నారు. ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌హేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహరి, మోత్కుపల్లి న‌ర్సింహులు , దేవేంద‌ర్ గౌడ్, రేవంత్ రెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిపోయినా రమణ మనోనిబ్బరంతోనే ఉన్నారు. అధ్యక్షుడిగా పార్టీని ఏదో ఒక రోజు పైకి తీసుకురావాలని భావించినా సాధ్యపడకపోవడంతో ఈయన కూడా టీడీపీ కాడిని కింద పడేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రమణ టీఆర్ఎస్లో చేరిన వెంటనే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. దీంతో అందరూ రమణ అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా, మరొకసారి పార్లమెంటు సభ్యుడిగా ,మళ్లీ ఎమ్మెల్యేగా.. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా.. ఇలా సాగింది రమణ రాజకీయ జీవితం. ఇలా మూడు చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు రమణ.