iDreamPost
iDreamPost
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పూర్తయిన పదిహేనేళ్ల తర్వాత హీరోల ఛాయస్ లో గణనీయమైన మార్పులు తెచ్చేసుకుంటోంది. టాలీవుడ్ లో ఇప్పటి స్టార్ హీరోలతో మొదలుకుని చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్లతోనూ నటించిన ఘనత సాధించుకున్న తర్వాత ఇప్పుడు సత్యదేవ్ లాంటి అప్ కమింగ్ యాక్టర్స్ తోనూ జోడి కడుతోంది. ఓటిటి స్టార్ గా గుర్తింపు పొందుతున్న సత్యదేవ్ ఓ పెద్ద హీరొయిన్ తో నటించడం ఇదే మొదటిసారి . కన్నడలో ఫీల్ గుడ్ సూపర్ హిట్ మూవీగా పేరు తెచ్చుకున్న లవ్ మాక్టైల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ ఈ నెల 28న ప్రారంభించబోతున్నట్టు ఫిలిం నగర్ న్యూస్.
అయితే విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి టైటిల్ కూడా లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ ని దాదాపు ఖరారు చేశారని వినికిడి. ఇది గతంలో నితిన్ చల్ మోహనరంగాకు అనుకున్న పేరు. త్రివిక్రమ్ స్వయంగా రికమండ్ చేసిందని కూడా అప్పట్లో టాక్ వచ్చింది. ఇప్పుడీ కథకు చక్కగా సరిపోతుందని గుర్తించి ఇదే అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మత్తు వదలరా, కలర్ ఫోటో లాంటి బడ్జెట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి వారసుడు కాలభైరవ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఛాయాగ్రహణం సత్య అందించబోతున్నట్టు సమాచారం.
ఒరిజినల్ వెర్షన్ అంత సక్సెస్ అవ్వడానికి కారణం అందులో ఉన్న ఎమోషన్స్. ఒక ప్రేమ జంట మధ్య జరిగే అందమైన జీవిత ప్రయాణాన్ని అన్నిరకాల భావోద్వేగాలతో తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే తెలుగు ఆడియన్స్ కూ నచ్చుతుందనే నమ్మకంతో నిర్మాతలు రీమేక్ కు సిద్ధమయ్యారు. గతంలో సందీప్ కిషన్, నవదీప్ లతో నటించిన తమన్నా ఇకపై ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా మంచి కథలకు ఓకే చెప్పేలా ఉంది. నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అయితే మాత్రం ఇక్కడా అంతే విజయం సాధించడం ఖాయం కాకపోతే ఇది థియేట్రికల్ రిలీజ్ కూడా రెడీ అవుతుందా లేక ట్రెండ్ కు తగ్గట్టు ఓటిటిని ఫాలో అవుతుందా వేచి చూడాలి