Idream media
Idream media
ఎన్నికలు జరిగితే అన్ని పార్టీలకూ ఉత్తరప్రదేశ్ కీలకంగా మారనుంది. అతిపెద్ద రాష్ట్రంపైనే అందరి కన్నూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీయే ఇప్పటికీ బలంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు తీవ్రమైన కసరత్తు చేస్తున్నాయి. యూపీ రాజకీయాల్లో ఇప్పటి వరకు అయోధ్య రామమందిర నిర్మాణం ప్రధాన అంశంగా ఉండేది. తాజాగా కృష్ణభగవానుడిని తెరపైకి తెస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలు ఇప్పుడు కృష్ణుడిని రాజకీయ వివాదాల్లోకి లాగుతున్నాయి.
ముఖ్యమంత్రి యోగి, బీజేపీ ఎంపీ హేమమాలిని సహా కొందరు అధికారపార్టీ నేతలు కృష్ణ జపం చేస్తున్నారు. ‘‘మధురలో భారీ దేవాలయ నిర్మాణానికి అధికార బీజేపీ సన్నాహాలు చేస్తోంది’’ అంటూ తాజాగా ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యా వివాదాస్పద ‘‘తేనెతుట్ట’’ను కదిలించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా కృష్ణుడి పేరును రాజకీయ లబ్ధికోసం వాడుకునేందుకు సిద్ధమయ్యారు. ‘‘కృష్ణుడు రోజూ రాత్రి నా కలలోకి వస్తాడు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావు. యూపీలో రామరాజ్యం స్థాపిస్తావు అని చెబుతాడు’’ అంటూ అఖిలేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగానే స్పందించారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధురనుగాని, కృష్ణుడితో ముడిపడిఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలనుగాను అఖిలేశ్ పట్టించుకోలేదని యోగీ దుమ్మెత్తిపోశారు. ఎస్పీ ప్రభుత్వంలోని వారిని ‘‘కంసుడుని పూజించేవారు’’గా యోగి అభివర్ణించారు. ‘‘కృష్ణుడు వారి (ఎస్పీ నేతలు) కలలోకి వస్తాడు. మీరు చేయలేని కార్యక్రమాలను బీజేపీ చేస్తుంది అని చెబుతాడు’’ అని కూడా సీఎం ఎద్దేవా చేశారు. బీజేపీ కాకుంటే ఏ ప్రభుత్వం మధురలోని ఆలయాలను అభివృద్ధి చేస్తుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్ కూడా ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడారు. మరోవైపు, ఔరంగబేజ్ కాలంనాటి షాహి ఈద్గా మసీదు కృష్ణుడి జన్మస్థలమని వాదిస్తూ.. అక్కడే కృష్ణుడి విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది హిందూ సంస్థ ప్రతినిధులు స్థానిక కోర్టులో ఇప్పటికే కేసులు వేశారు. ఈ మసీదు ఇప్పుడున్న మధుర జన్మస్థాన్ కాంప్లెక్స్‌లోగల కృష్ణ మందిరానికి ఆనుకుని ఉంది.