Idream media
Idream media
ఓ మాజీ ముఖ్యమంత్రి కి మనవడు.. అప్పుడు తండ్రి ముఖ్యమంత్రి. ఎమ్మెల్సీగా పని చేసి మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. అదే వైఎస్ జగన్ తొలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అదే విధంగా తెలంగాణలో కేసిఆర్ తనయుడు కేటిఆర్ కూడా తొలి ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో గెలిచారు. కానీ లోకేష్ కు ఆ అనుభవం రాలేదు. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి బంపర్ మెజార్టీతో గెలిచేస్తారట. మైకు దొరికిన ప్రతిసారీ లోకేష్ నోట ఈమాట పదే పదే వినిపిస్తోంది. 36 గంటలదీక్షా సభలో .. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి మంగళగిరిని గిఫ్ట్ గా ఇస్తాను.. అంటూ చంద్రబాబుకు సభాముఖంగా తెలిపారు. ఆ ప్రకటన ఆయనలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ ప్రకటన చేసిన కొద్ది నాళ్లకే లోకేష్ మంగళగిరిలో రెండుసార్లు పర్యటించారు.
తాజాగా మరోసారి నారా లోకేశ్ మంగళగిరి లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను పరామర్శించి వారితో కలిసి వారి సమస్యలని అడిగి తెలుసుకుంటున్నారు. పట్టణంలో పది మంది చిన్నతరహా వ్యాపారులకు తోపుడుబండ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాదిరి తాను మాట తప్పనని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మాదిరి మాట మార్చే ప్రసక్తేలేదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని, బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఇప్పటి నుంచే ఓటర్లను వేడుకుంటున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి తరువాత.. ఆయన నియోజకవర్గం మారుస్తున్నారని ప్రచారం జరిగింది. విశాఖపట్నంలోని భీమిలి లేదా నార్త్.. లేదా మామ కంచుకోట హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలు అన్నింటికీ చెక్ పెడుతున్నారు నారా లోకేష్ .ఇలా మనసు మారడానికి వేరే కారణం ఉంది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
తన తండ్రి కంచుకోట అనుకునే కుప్పంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత ఆయన మనసు మారినట్టు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం నారా ఫ్యామిలీ కంచుకోట. అక్కడ ప్రచారానికి వెళ్లినా నారా చంద్రబాబు నాయుడికి అపజయం తప్పలేదు. దీంతో నెక్స్ట్ చంద్రబాబు అయినా గెలుస్తారా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో లోకేష్ మాత్రం తప్పకుండా గెలుస్తా.. గిఫ్ట్ ఇస్తా.. సాధిస్తా అంటూ లోకేష్ ప్రకటనలు ఇవ్వడం హ్యాస్యాస్పదంగా మారిపోయింది.
2024 ఎన్నికలకు చాలా సమయమే ఉన్నా ఇప్పటి నుంచే తనకు అంటూ ఒక నియోజవర్గం ముందు నుంచి వెతికి పెట్టుకోకపోతే.. భారీ నష్టం తప్పదని నిర్ణయానికి వచ్చారు. అయితే కొత్త నియోజకవర్గం వెతుక్కోడం కంటే గతంలో ఓడిన చోటే గెలవాలని శ్రమిస్తున్నారు. అందుకే గతంలో ఎప్పుడు మంగళగిరి వెళ్లినా.. కేవలం కేడర్ పార్టీ నేతలతో మాట్లాడి వెళ్లే వారు.. కానీ ఇప్పుడు నేరుగా సామాన్యులను కలుస్తున్నారు. వారితో కాసేపు మాట్లాడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలోనే లీడర్లు ఇలాంటి స్టంట్లు చేస్తుంటారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎన్నికలు లేకున్నా అక్కడి సామాన్య ప్రజలతో నిత్యం కలుస్తూనే ఉన్నారు. మొత్తంగా నారా లోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి లో గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి లోకేష్ ప్రయత్నాలు ఫలిస్తాయా?