iDreamPost
android-app
ios-app

రఘురామరాజుకు ఎదురుదెబ్బ..!

రఘురామరాజుకు ఎదురుదెబ్బ..!

సొంత పార్టీ విధానాలను, ప్రభుత్వ నిర్ణయాలను, పార్టీ అధినేతను విమర్శిస్తూ.. అనర్హత వేటు ముందు నిలుచున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామరాజుకు ఈ వ్యవహారంలో మొదటి దెబ్బ తగిలింది. రఘురామ రాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పరిగణలోకి తీసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని తాజాగా ప్రకటించారు.

వరుస భేటీలతో రఘురామరాజు..

తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దని, పరిగణలోకి తీసుకొవద్దని రఘురామరాజు గతంలో స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. సొంత పార్టీని విభేదిస్తున్నప్పటి నుంచి ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సమావేశం అవుతూ.. ఆ భేటీల తాలుకూ ఫొటోలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేస్తున్నారు. వైసీపీ ఫిర్యాదు తర్వాతా ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తనను ఏమీ చేయలేరని, తనకు బీజేపీ పెద్దల మద్ధతు ఉందనేలా రఘురామరాజు పరోక్ష సందేశాలు ఇవ్వసాగారు. అదే సమయంలో తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇన్నాళ్లు మౌనం.. సాయిరెడ్డి వ్యాఖ్యలతో స్పందన..

కారణాలు ఏమైనా.. అనర్హత వేటు వ్యవహారం కొన్నాళ్లుగా సాగుతున్నా.. స్పీకర్‌ దృష్టి సారించలేదు. పలుమార్లు వైసీపీ ఎంపీలు కలిసి తమ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని కోరినా ఆయన స్పందించలేదు. అయితే రెండు రోజుల క్రితం వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తమ ఎంపీలతో వెళ్లి మరోమారు స్పీకర్‌ను కలిశారు. ఫిర్యాదు చేసిన ఆరు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలనే నిబంధనను గుర్తు చేశారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయకుంటే.. పార్లమెంట్‌లో ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో.. స్పీకర్‌ పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నట్లుగా ఉందని మీడియాతో అన్నారు. ఈ పరిణామాలతో మేలుకొన్న స్పీకర్‌ ఓం బిర్లా తొలిసారి రఘురామ రాజు అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందించారు. ఇక ఇరువైపుల వాదనలు విన్నడమే తరువాయి.

Also Read: రాజకీయాల్లో ముమైత్ ఖాన్.. శ్రీరెడ్డి..!