iDreamPost
android-app
ios-app

మరో నెల రోజులు లాక్‌డౌన్‌.. కేంద్రం సంకేతాలు

మరో నెల రోజులు లాక్‌డౌన్‌.. కేంద్రం సంకేతాలు

కరోనా మహమ్మారి కట్టడికి దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ అమలవుతోంది. గత ఏడాది లాక్‌డౌన్‌ను అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ సారి మాత్రం ఆ బాధ్యత, నిర్ణయాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలపై పెట్టింది. స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని.. పాక్షిక, సంపూర్ణ లాక్‌డౌన్లు, రాత్రి కర్ఫ్యూలు, కంటైన్‌మెంట్‌ జోన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ లాక్‌డౌన్లు అమల్లో ఉన్నాయి.

అటు ఉత్తర భారతంలోనూ, ఇటు దక్షిణ భారతంలోని అన్ని పెద్ద రాష్ట్రాలు లాక్‌డౌన్లను అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు నాలుగు లక్షల నుంచి రెండు లక్షలకు తగ్గుముఖం పట్టాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే ఇంకా ముప్పు ముంగిటే ఆయా రాష్ట్రాలున్నాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గి, కేసులు నియంత్రణలోకి వచ్చేందుకు మరో నెల లేదా నెలున్నర రోజులు పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జూలై మధ్య నాటికి దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ నియంత్రణలోకి వస్తుందని, ఆ తర్వాత మరో ఏడెనిమిది నెలలకు మూడో వేవ్‌ వస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి కేంద్ర హోం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. కరోనా పాజిటివ్‌ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టలేదని, ముప్పు ఇంకా ఉందంటూ.. కంటైన్మెంట్‌ చర్యలు కొనసాగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. జూన్‌ 30వ తేదీ వరకూ కంటైన్మెంట్‌ చర్యలు కొనసాగించాలంటూ అజయ్‌ భల్లా ఆ లేఖలో సూచించారు.

లాక్‌డౌన్లు జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగించాలంటూ కేంద్రం ఈ విధంగా పరోక్ష సంకేతాలు ఇచ్చింది. వైరస్‌ వ్యాప్తి ఆధారంగా వారం లేదా పక్షం రోజులకోసారి లాక్‌డౌన్లు కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నెలాఖరున లాక్‌డౌన్ల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే ముందు.. కేంద్ర హోం శాఖ నుంచి ఈ విధమైన సూచనలు రావడంతో.. మరో నెల రోజుల పాటు లాక్‌డౌన్లు అమలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.