25 ఏళ్ల పోరాటం. 5 వేల కోట్లు ఖర్చుః కానీ సాధ్యం కాలేదుః కరోనాతోనే సాధ్యమైంది..యమునా నది స్వ‌చ్ఛం.

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. మావవాళి మనుగడకు సవాల్ విసురుతున్న మహమ్మారి. 213 దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. మన దేశంలోనూ కరోనా తీవ్రత అధికాంగానే ఉంది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అస్త్రాన్ని సంధించింది కేంద్ర ప్ర‌భుత్వం. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా క‌ఠినంగా అమలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. షాపులు, పరిశ్రమలు, ప్రజా రవాణ ఇలా అన్నీ బంద్ అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయగలిగామా లేదా అనే వాదలను పక్కన పెడితే.. లాక్ డౌన్ వల్ల చాలా మంచే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పర్యావరణానికి, జీవ నదులకు చాలా మేలు జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

లాక్‌డౌన్‌కు ముందు దేశంలోని ప్రధాన నదులన్ని కాలుష్యకాసారాలుగా ఉండేవి. మురుగు నీరు, రసాయన వ్యర్థాలు, మానవ కళేబరాలతో కాలుష్యానికి కేంద్ర బిందువులుగా నిలిచేవి. అయితే కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఈ నదులకు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. దాదాపు రెండు నెలలుగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, పరిశ్రమలు మూతపడటంతో నదులన్ని తిరిగి స్వచ్ఛతను సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే యమునా నది గతంలో లేనంత స్వచ్ఛంగా మారింది.

పాతికేళ్లలో కానిది 60 రోజుల్లో అయ్యింది

లాక్ డౌన్ కారణంగా అసాధ్యం అనుకున్న పని సుసాధ్యమైంది. యమునా నది పరిశ్రుభ్రమైంది. యుమునా నది స్వచ్చతను సంతరించుకుంది. గత 25 సంవత్సరాల్లో రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఏళ్లుగా.. కోట్లు ఖర్చు చేసినా రాని ఫలితాన్ని రెండు నెలల లాక్‌డౌన్‌ సాధించింది. ఆంక్షల నేపథ్యంలో ఫ్యాక్టరీలు, కంపెనీలన్నీ మూతపడటంతో యమునా నది స్వచ్ఛతను సంతరించుకుంది. ఎవరి ప్రమేయం లేకుండా దానికదే శుభ్రపరచుకుంది. కాలుష్యం తగ్గడంతో వేలాది పక్షులు నదికి వలస కట్టాయి. ప్రకృతి ధర్మం మేరకు చేపల్ని, ఇతర నీటి ప్రాణుల్ని వేటాడుతూ తమ ఆకలి తీర్చుకుంటున్నాయి.

1,400 కిమీ పొడవు, 7 రాష్ట్రాల మీదుగా ప్రవాహం

దాదాపు 1400 కి.మీ పొడవుండే యమునా నది ఏడు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నదీ ఒడ్డున ఉన్న కాలనీల మురుగు నీరు, కర్మాగారాల నుంచి వెలువడే రసాయనాలు అందులో వచ్చి చేరుతుంటాయి. పారిశ్రామిక యూనిట్లు వాటి మలినాలను యమునలోకి విడుదల చేస్తాయి. హర్యానాలోని పానిపట్‌, ఢిల్లీ మధ్య దాదాపు 300 ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు నదిలో వచ్చి చేరుతాయి. దీంతో దేశంలోనే అత్యంత కాలుష్యమైన నదిగా యమునా నది నిలిచింది. 80 శాతం కాలుష్యం ఢిల్లీ, ఆగ్రా, మధుర మధ్యే జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా ఇది దేశంలోనే అత్యంత కలుషితమైన నదిగా య‌మునా మారింది.

గత 30 ఏళ్లలో ఇంత స్వచ్చంగా లేద‌ట‌

అయితే లాక్‌డౌన్‌ వల్ల గతంతో పోలిస్తే ఢిల్లీ ప్రాంతంలో నది 33శాతం స్వచ్ఛతను సంతరించుకుందని ‘‘ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ’’ తేల్చింది. ఇంకా.. మధుర దిశగా సాగే యమున మరింత శుభ్రంగా ఉందని పేర్కొంది. గత 30 ఏళ్లలో తాను నదిని ఇంత స్వచ్ఛంగా ఎప్పుడూ చూడలేదని ‘‘యమునా యాక్షన్‌ ప్లాన్‌’’ బృందంలోని ఓ సభ్యుడు తెలిపారు. ‘‘సాధారణంగానే నదులకు తమను తాము శుభ్రపర్చుకునే లక్షణం ఉంటుంది. గత 2 నెలలుగా కాలుష్యకారకాలు యమునలో కలవకపోవడంతో స్వచ్ఛంగా మారింది. ఇది ఇలాగే కొనసాగాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ఆయన కోరారు. క్రమంగా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వెంటనే దీనిపై ప్రభుత్వ యంత్రాంగాలు దృష్టి సారించాలని సూచించారు.

పర్యావరణానికి మేలు చేసిన లాక్ డౌన్

68 రోజుల లాక్ డౌన్ కారణంగా కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైన మాట వాస్తవమే. కానీ లాక్ డౌన్ కారణంగా ఎక్కువ లబ్ది కలిగింది పర్యావరణానికే. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా జరగని పనులు లాక్ డౌన్ చేసి పెట్టింది. దేశంలోని పలు జీవ నదులు స్వచ్చంగా మారాయి. గంగా, యమునా వంటి తీవ్ర క‌లుషిత న‌దుల‌న్నీ స్వచ్ఛంగా మార‌డం మంచి ప‌రిణామం. ఎవరి ప్రమేయం లేకుండానే తమను తాము శుభ్రపర్చుకున్నాయి. ఎంతో దూరం నుంచి కూడా హిమాలయాలు కంటికి కనిపిస్తున్నాయి. గాలిలో కాలుష్యం తగ్గి నాణ్యత పెరిగింది. ఇలా పర్యావరణానికి లాక్ డౌన్ చేసిన మేలు అంతా ఇంతా కాదంటున్నారు పర్యావరణ వేత్తలు. ఇక ముందు కూడా ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ ఇలానే స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంటాయని చెబుతున్నారు.

Show comments