iDreamPost
iDreamPost
గతంలో సినిమా విడుదలయ్యాక ఈ తరహా హెడ్డింగ్ తో ప్రకటనలు న్యూస్ పేపర్ యాడ్, గోడలు, ఫ్లెక్సిల మీద చూసేవాళ్ళం. కానీ ఇలాంటి దురదృష్టకర పరిస్థితి మాత్రం ఎవరూ ఊహించనిది. సరిగ్గా నెల రోజుల క్రితం మార్చ్ 15 నుంచి తెలంగాణాలో థియేటర్లు, మాల్స్ మూసివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారి చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎపి సైతం ఇదే బాటలో నడిచింది. తాజాగా ఇందాక చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని మే 3 దాకా పొడిగిస్తూ కొత్తగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంకో 19 రోజులు ఇప్పుడున్న స్టేటస్ ఇలాగే కంటిన్యూ అవుతుందన్న మాట.
అంటే టికెట్ కౌంటర్ మూగబోయి అర్ధశతదినోత్సవం చేసుకోవడం ఖాయమని తేలిపోయింది. ఆపై కూడా సడలింపులు ఉంటాయని ప్రధాని చెప్పారు కాని కంప్లీట్ గా లాక్ డౌన్ తీసేస్తామని సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. ఇలా చూసుకుంటే భారతీయ సినిమా చరిత్రలో అత్యంత చీకటి కాలంగా ఇదే నిలిచిపోతుంది. కరోనా దెబ్బకు పెద్ద హీరోలతో మొదలుకుని రోజువారి వేతనం మీద ఆధారపడే కార్మికుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉన్నాయి.
ఇవన్ని ఇప్పుడు చాలా తీవ్రంగా ప్రభావితం చెందబోతున్నాయి. ఒకవేళ మే 3 కొన్ని రంగాలకు ఊరట కలిగించినా అందులో సినిమా పరిశ్రమ ఉండటం అనుమానమే. ఇప్పటికే వందల కోట్ల నష్టంతో అతలాకుతలం అవుతున్న ఇండస్ట్రీకి ఇప్పుడీ పొడిగింపు మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే. అయినా తప్పదు. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదనే సూత్రంతో చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి ఇంత కన్నా వేరే మార్గం లేదు. కరోనా సహాయంలో తమ వంతుగా చేయూతనందిస్తున్న సినిమా తారలు దాన్ని ఇంకొంత కాలం కొనసాగించేందుకు సిద్ధపడుతున్నారు. రిలీజులు, వాయిదా పడిన షూటింగుల రీ షెడ్యూల్స్ ని సెట్ చేసుకోవడం పెను సవాల్ గా మారబోతోంది.