iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ.. నెక్ట్స్‌ ఏంటీ..?

నిమ్మగడ్డ.. నెక్ట్స్‌ ఏంటీ..?

తాను తీసిన గోతిలో తానే పడిన చందంగా మారింది ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పరిస్థితి. ఉద్యోగ విరమణ చేసే నాటికి తాను వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నా.. పూర్వపు పనులు శాపాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. ఏ కారణం చెబుతూ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారో.. నేడు అదే అంశం ఎన్నికలు నిర్వహించేందుకు యత్నిస్తున్న నిమ్మగడ్డకు పెద్ద అడ్డుగా నిలుస్తోంది.

వాయిదా పడిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు గత నెలలో చేసిన ప్రయత్నాలు ఫలింకచపోవడంతో.. షెడ్యూల్‌ ఇచ్చినా.. నోటిఫికేషన్‌ ఇవ్వని పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ దృష్టి పెట్టారు, ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంగళవారం ప్రకటించారు, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు, ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు లేఖలు రాశారు. అలా లేఖ రాశారో లేదో.. ఇలా ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, పైగా శీతాకాలం.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమంటూ ఏపీ సీఎం నీలం సాహ్ని కుండబద్ధలు కొట్టారు. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని తేల్చి చెప్పడంతో నిమ్మగడ్డకు గొంతు పచ్చి వెలక్కాయ పడినట్లైంది.

రాష్ట్రంలో కరోనా కేసులు రెండు ఉన్నప్పుడు.. వైరస్‌ను సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలు పూర్తయితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని, పాలక మండళ్లు ఏర్పాటైతే వైరస్‌ నియంత్రణ సమర్థవంతంగా చేయగలుగుతామని ప్రభుత్వం వాదించినా.. ఫలితం లేకపోయింది. నాడు ప్రభుత్వం చేసిన వాదననే నేడు నిమ్మగడ్డ చేస్తుండడం ప్రజలందరూ గమనిస్తున్నారు.

Read Also : నిమ్మగడ్డ ప్రయత్నాలకు బ్రేక్‌.. ఏపీ సీఎస్‌ లేఖ

రాజ్యాంగపరమైన విధులు నిర్వర్తించేందుకు, ఆర్థిక సంఘం నిధులు వచ్చేందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందంటూ నిమ్మగడ్డ చెప్పుకొస్తున్నారు. మరి నాడు ఇదే మాట ప్రభుత్వం చెబితే.. పెడచెవిన పెట్టిన నిమ్మగడ్డ నేడు అవే మాటలు వల్లెవేస్తున్న తీరు చూస్తున్న ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. నాడు ప్రజల ప్రాణాలే ముఖ్యం అంటూ వాదించిన కమిషనర్‌.. నేడు 6,890 మంది మరణించినా, వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నా ఆ అంశాలను నామమాత్రంగా పట్టించుకోకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. పక్క రాష్ట్రాలలో జరుగుతున్నాయి.. ఇక్కడ ఎందుకు జరపకూడదంటూ వాదిస్తూ చిన్నపిల్లాడిని తలపిస్తున్నారు.

ఏదిఏమైనా.. తాను దిగిపోయే లోపు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న నిమ్మగడ్డకు.. ప్రతిసారి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. న్యాయస్థానాల్లోనూ నిమ్మగడ్డకు అనుకూల ఫలితాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల వాయిదాకు నాడు వైరస్‌ను కారణంగా చూపిన తన వాదనను బలపరిచిన కోర్టులు..ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తానని వెళితే ఎలా స్పందిస్తాయో నిమ్మగడ్డకు ఈపాటికే అర్థం అయింది.

ఫిబ్రవరిలోనూ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో మార్చిలో ఉద్యోగ విరమణ చేయబోతున్న నిమ్మగడ్డ ఎలా స్పందించబోతున్నారు..? ఎన్నికలు నిర్వహించాలనుకునే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు తదుపరి స్టెప్‌ ఎలా వేయబోతున్నారు..? అనే చర్చ ప్రస్తుతం సాగుతోంది.

Read Also : గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ..! మళ్లీ ముదురుతున్న ‘స్థానిక’ వివాదం