జిల్లాల విభజన తర్వాతే స్థానిక ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల పట్ల ఓవర్గం అమితాసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. కానీ నిజానికి క్షేత్రస్థాయిలో ఆ సెక్షన్ తీవ్రంగా సతమతమవుతున్న తీరు సుస్పష్టం. అయినప్పటికీ ఎన్నికల పట్ల ఆతృత ప్రదర్శించడం కేవలం పొలిటికల్ మైండ్ గేమ్ గా భావించాల్సి ఉంటుంది. నిజానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షుడు కూడా ఏపీలో లేరు. ఇప్పుడిప్పుడే బయటకు రాలేనని ఆయన ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మాత్రమే కాలు బయటపెట్టే యోచన6ఆయన ఉన్నారు. ఇక అసెంబ్లీలో రికార్డుల ప్రకారం ప్రాతినిధ్యం ఉన్న మరో పార్టీ జనసేన. ఆ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టి 8నెలలు గడుస్తోంది. ప్రస్తుతం సినిమాలు, ఇతర వ్యవహారాలో ఆయన బిజీగా గడుపుతున్నారు. అయినా ఎన్నికల సంఘం పేరుతో నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న ప్రయత్నం వెనుక అసలు లక్ష్యం వేరుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజనకు రంగం సిద్ధమైంది. ఎన్నికల హామీకి అనుగుణంగానే జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదంతో ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు అయ్యింది. త్వరలో నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి కీలక ప్రకటన కూడా చేశారు. రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికి, అరకు పార్లమెంట్ స్థానంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో 26 జిల్లాలు ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. జనవరి నాటికే కొత్త జిల్లాలు పాలనా పరంగా ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.

జిల్లాల విభజన విషయంలో పలు అభిప్రాయాలు ఉన్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు పట్ల అంతా సుముఖంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే అభిప్రాయం తో ఉంది. 2021 ప్రారంభలోనే పాలనా వికేంద్రీకరణ కు తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం రాష్ట్ర స్థాయి మార్పులతో సరిపెట్టకుండా జలాల్లో కూడా వికేంద్రీకరణ ఫలితాలు చేరేలా సంకల్పించారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన మూలంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు మారిపోయే అవకాశం ఉంది. పైగా పాత జిల్లాల్లో ఎన్నికలు జరిపి, విభజన చేస్తే పాలనకు ఆటంకం అవుతుంది. దాంతో జిల్లాల సరిహద్దుల మార్పు విషయంలో చురుగ్గా కదలికలు ఉండడంతో స్థానిక ఎన్నికల ముహూర్తం కూడా వాటిని నిర్దారించిన తర్వాత పెట్టాలని ఆశిస్తున్నారు. ఎస్ ఈ సి ముందు కొన్ని పార్టీలు ఇదే ప్రతిపాదన చేయడం గమనార్హం. దానికి అనుగుణంగానే వచ్చే ఏడాదిలోనే స్థానిక సమరం షురూ అవుతుందని అంచనాలు పెరుగుతున్నాయి.

Show comments