iDreamPost
android-app
ios-app

అటు నుంచి నరుక్కొస్తున్న నిమ్మగడ్డ..!

అటు నుంచి నరుక్కొస్తున్న నిమ్మగడ్డ..!

వ్యక్తిగత ప్రతిష్ట, వ్యయ, ప్రయాసలకోర్చి పోయిన పదవిని కోర్టుల ద్వారా తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తాను పదవిలో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తాజాగా జరుగుతున్న పరిణామాలతో అర్థం అవుతోంది.

సోమవారం సుప్రిం కోర్టులో ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది.. స్థానిక సంస్థలను వాయిదా మాత్రమే వేశామని, నిరవదిక వాయిదా వేయలేదని, రద్దు చేయలేదని చెప్పడం ద్వారా.. ఇప్పటి వరకూ జరిగిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తారని సాగిన ప్రచారానికి, రద్దు చేయాలంటూ టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న డిమాండ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఈ రోజు.. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిస్తామంటూ కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడడం విశేషం.

ఈ రెండు పరిణామాలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రూటు మార్చారనే టాక్‌ వినిపిస్తోంది. పోయిన పదవిని తిరిగి తెచ్చుకున్న తర్వాత.. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు యత్నిస్తున్నా.. అడుగు ముందుకుపడడం లేదు. అందుకే రూటు మార్చారు. ఈ సారి కొత్త పంథాలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. మధ్యలో ఉన్న మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ద్వారా కాకుండా.. ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామనే ప్రకటనను చేశారని చెబుతున్నారు.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ తర్వాత మధ్యలో ఆగిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఎలాగూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీ కాలం మార్చి 31వ తేదీ వరకూ ఉంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తే.. మార్చిలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను జరపవచ్చనేదే నిమ్మగడ్డ ప్లాన్‌గా భావిస్తున్నారు. అందుకే.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సరికాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని ఉదహరిస్తున్నారు.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఎన్నికల వాయిదా వేసేందుకు కారణమైన కరోనా.. నేడు ఎన్నికలు నిర్వహించేందుకు అదే కరోనా వైరస్‌ అడ్డుగా ఉండడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేసిన సమయలోనూ కరోనా పాజిటివ్‌ కేసులను నిమ్మగడ్డ ప్రముఖంగా ప్రస్తావించారు. రోజుకు పదివేల చొప్పున నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు.. ఇప్పుడు 753కు తగ్గాయని చెప్పారు. అయితే… ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్‌ ఏ స్థితిలో ఉంటుందో ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. మరి ఎన్నికలను నిర్వహించాలనే నిమ్మగడ్డ ప్రయత్నాలకు కరోనా వైరస్‌ సహకరిస్తుందా..?లేదా..? అనేది ఫిబ్రవరిలో తేలుతుంది.