Idream media
Idream media
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వారి మనసులు గెలుచుకున్న గ్రామ వలంటీర్లు చివరికి ఆ గ్రామాల పాలనా పగ్గాలే చేపట్టారు. వారు చేస్తున్న కృషికి మెచ్చిన ఆయా గ్రామాల ప్రజలు వారిని ఏకంగా సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు. వాలంటీర్లు, ఆ వ్యవస్థ పై చిన్న చూపు చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశం తో వాలంటీర్లు గా ప్రజలకు సేవ చేస్తూ… వారి ఆదరణతో సర్పంచ్ లు కావడం చర్చ నీయాంసంగా మారింది. ఏడాదిన్నర కాలంలో నే వాలంటీర్లు ప్రజలలో ఎంతలా మమేకం అయ్యారో తెలియజేయ డానికి ఈ పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మొదటి నుంచీ వాలంటీర్లను చిన్న చూపు చూస్తున్న ప్రతిపక్షం ఎన్నికల వేళ కూడా అదే ధోరణి అవలం భించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దూరం పెట్టాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పదే పదే అదే అభిప్రాయం వ్యక్తం చేసేవారు. పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని అన్నారు. అనడమే కాదు.. తన అధికారాలను ఉపయోగించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లకు సంబంధించి కీలక ఆదేశాలిచ్చారు. అలాగే వాలంటీర్లెవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు. ఏపీలో 3లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్లు., దాదాపు 60వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల పేరు చెప్పి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు కూడా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంత కాలం ఆదేశాలు అమలో ఉంటాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
అయితే, కొందరు వలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండడం కాదు.. ఏకంగా పోటీలో నిలబడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చూపిన చొరవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. మొత్తం వలంటీర్ వ్యవస్థను దేశమే శభాష్ అంటోంది. అలాంటి వ్యవస్థ ప్రతిపక్షానికి గిట్టడం లేదు. కానీ ప్రజలలో ఆ వ్యవస్థపై ఉన్న అభిమానం ఓట్ల రూపంలో కొందరిపై కురిపించారు. ఏకంగా వారిని సర్పంచ్ పదవుల్లో కూర్చోబెట్టారు.
ఒక్క విశాఖపట్టణం జిల్లాలోనే ముగ్గురు వలంటీర్లు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మునగపాక మండలం మెలిపాకలో అయినంపూడి విజయభాస్కరరాజు, బుచ్చెయ్యపేట మండలం మంగళాపురానికి చెందిన పద్మరేఖ, కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కరక రాజ్యలక్ష్మిలు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి పోటీచేసి గెలుపొందారు. వలంటీర్లుగా ప్రజాభిమానం పొందడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని వారంటున్నారు. ప్రభుత్వం అందించిన వలంటీర్ ఉద్యోగం తమ జీవితాలను గొప్ప మలుపు తిప్పిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఈ వలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.