iDreamPost
iDreamPost
Liger money laundering probe ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన లైగర్ నీలినీడలు యూనిట్ ని ఇంకా వదలడం లేదు. మూడు వారాల క్రితం పూరి జగన్నాధ్ నిర్మాణ భాగస్వామి ఛార్మీని పిలిపించిన ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తాజాగా విజయ్ దేవరకొండను విచారించింది. ఫెమా(ఫారెన్ ఎక్స్ చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్) కింద లైగర్ కు అన్ని కోట్ల పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి విజయ్ కేవలం పారితోషికం తీసుకున్న నటుడే అయినప్పటికీ అతనికి ఎంత మొత్తం చెల్లించారు, వాటి తాలూకు రసీదులు, అకౌంట్ వివరాలు, యుఎస్ వెళ్ళినప్పుడు మైక్ టైసన్ తో జరిపిన డీల్ తాలూకు ఖర్చులు అన్నీ అడుగుతున్నారట
ఇది ఎక్కడిదాకా వెళ్తుందో ఇంకా అంతు చిక్కడం లేదు. అక్రమ విదేశీ పెట్టుబడులకు సంబంధించిన చట్టమే ఫెమా. చాలా కఠినంగా అమలవుతుంది. ఒకవేళ అభియోగాలు నిజమైతే శిక్ష కూడా తప్పదు. అసలు లైగర్ కు పెట్టిన బడ్జెట్ ఎంత, కేవలం ప్యాన్ ఇండియా ప్రమోషన్ల కోసమే లేని మొత్తాన్ని ఎక్కువ చేసి చూపించారనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లోనే తలెత్తుతున్నాయి. ఆర్ఆర్ఆర్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి ప్రమోషన్ చేసినదానికి ఇప్పుడీ పరిణామాలకు ఏమైనా లింక్ ఉందా అంటే చెప్పలేం. గతంలో ఇలాగే డ్రగ్స్ కేసులో విచారణ ఎదురుకున్న పూరి ఆ తర్వాత దాన్నుంచి క్లీన్ చిట్ తో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోగా ఇది చుట్టుకుంది.
విజయ్ దేవరకొండ తప్పేమీ లేకపోవచ్చు కానీ ఇలాంటి పరిస్థితిని ఎదురుకోవాల్సి రావడం మాత్రం ఇబ్బంది కలిగించేదే. లైగర్ ని ఎప్పుడు చూసినా అందులో వందల కోట్ల పెట్టుబడేం కనిపించదు అలాంటప్పుడు ఇతర చిత్రాలకు రాని సమస్య ఒక్క దీనికి మాత్రమే ఎదురు కావడం విచిత్రం. ఈ ఇన్వెస్టిగేషన్ కు సంబందించిన వ్యవహారాలన్నీ ప్రభుత్వం అధీనంలో ఉంటాయి కాబట్టి ఏం జరిగిందనే వివరాలు బయటికి చెప్పరు. కేసు ఫైల్ అయితేనే తప్ప మీడియాకు సైతం ఇన్ఫార్మ్ చేయరు. ఏది ఏమైనా ఇకపైనైనా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి లెక్కలు చాలా అవసరం