iDreamPost
iDreamPost
గత నెల 25న భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన లైగర్ ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని తాలూకు నష్టాలకు పూచీగా నిలవడం పూరి జగన్నాధ్ కు తలకు మించిన భారంగా మారింది. ఇటీవలే తనను కలిసిన బయ్యర్లకు ఈ నెలాఖరులోగా ఫైనల్ సెటిల్ మెంట్ చేస్తానని హామీ ఇచ్చినట్టుగా ట్రేడ్ టాక్. విపరీతమైన ప్రమోషన్లకు తోడు దేశం మొత్తం వాట్ లగా దేంగే అంటూ టీమ్ ఇచ్చిన పబ్లిసిటీ మిస్ ఫైర్ అయ్యింది. కనీసం వారం రోజులు నిలవలేక వెనక్కు వచ్చిన లైగర్ థియేట్రికల్ రన్ పది రోజులకే ముగియడం విషాదం. ఈ నేపథ్యంలో ఈ నెల 22కే తెలుగు తమిళ మలయాళం భాషల్లో ఓటిటి ప్రీమియర్ జరుపుకోనుంది
హిందీ మాత్రం ప్రస్తుతానికి లేదు. నిజానికి యాభై రోజుల తర్వాత లైగర్ డిజిటల్ లో ఉంటుందని విజయ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. హాట్ స్టార్ కూడా ముందు ఆ మేరకే ఒప్పందం చేసుకుందట. అయితే అనూహ్యంగా మారిన పరిణామాల వల్ల నెలకు కూడా కట్టుబడలేని పరిస్థితి నెలకొంది. అందుకే ముందస్తుగా డిజిటల్ కు వస్తోంది. ఇంతకన్నా ఆలస్యం చేస్తే కనీసం ఓటిటిలో అయినా చూద్దామనుకున్న వాళ్ళ ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఈ రిజల్ట్ దెబ్బకే పూరి విజయ్ దేవరకొండ కాంబోలో ప్లాన్ చేసుకున్న జనగణమనకు అర్ధాంతరంగా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అడ్వాన్స్ ఇచ్చి మరీ లాక్ చేసుకున్న పూజా హెగ్డే లాంటి ఆర్టిస్టుల డేట్లు వృధా అయ్యాయి.
గత నెల స్ట్రైక్ సందర్భంగా ఇకపై ఏ సినిమా అయినా సరే కనీసం 8 వారాల ఓటిటి గ్యాప్ ఉండాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే లైగర్ ఎప్పుడో జరిగిన అగ్రిమెంట్ కాబట్టి దీని పరిధిలో రాదు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే లైగర్ లాంటి డిజాస్టర్లు భవిష్యత్తులోనూ వస్తాయి. అలాంటప్పుడు బలవంతంగా రెండు నెలల తరువాతనే స్ట్రీమింగ్ అంటే సదరు ఓటిటిలు భారీగా రేట్ తగ్గించడంతో పాటు జనంలోనూ ఇంటరెస్ట్ తగ్గిపోతుంది. అందుకే ఈ నిబంధన ఎంత మేరకు అమలు చేయగలరో అనుమానమే. బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఎటొచ్చి లైగర్ లాంటి ఫ్లాపులు మాత్రం దాన్ని ఫాలో కావడం కష్టమే