iDreamPost
iDreamPost
సోషల్ మీడియాతో పాటు సాధారణ పబ్లిక్ కూడా లైగర్ గురించిన నెగటివ్ టాక్ తో బిజీగా ఉంది. విపరీతమైన అంచనాలు మోస్తూ భారీ బిజినెస్ తో ప్యాన్ ఇండియా ప్రమోషన్లతో విడుదలకు ముందు ఓ రేంజ్ లో రచ్చ చేసిన ఈ మార్షల్ ఆర్ట్స్ ఎంటర్ టైనర్ అంచనాలను కనీస స్థాయిలో అందుకోలేకపోవడం అభిమానులను బాధిస్తోంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పుణ్యమాని టైర్ 2 హీరోల్లో విజయ్ దేవరకొండ రికార్డు సాధించాడు కానీ లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇవాళ్టి నుంచి గ్రాఫ్ డౌన్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న సెంటర్లలో లైగర్ కు అదనంగా ఇచ్చిన స్క్రీన్లు తిరిగి కార్తికేయ 2, సీతారామంలకు వెళ్లిపోతున్నాయి.
ఇక వసూళ్ల విషయానికి వస్తే లైగర్ వరల్డ్ వైడ్ టోటల్ 13 కోట్ల 45 లక్షల దాకా షేర్ సాధించినట్టు ట్రేడ్ రిపోర్ట్. వాస్తవానికి ఇరవై దాకా ఎక్స్ పెక్ట్ చేస్తే ఉదయం వచ్చిన డివైడ్ టాక్ సాయంత్రం ప్రభావం చూపించడంతో లెక్కలో తేడాలు వచ్చేశాయి. నైజామ్ అత్యధికంగా 4 కోట్ల 22 లక్షలు, సీడెడ్ 1 కోటి 32 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 27 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 3 లక్షలు, గుంటూరు 82 లక్షలు, కృష్ణా 48 లక్షలు, నెల్లూరు 40 లక్షలు, కర్ణాటకతో కలిపి రెస్ట్ అఫ్ ఇండియా 55 లక్షలు, తమిళ మలయాళం వెర్షన్లు 22 లక్షలు, నార్త్ హిందీ డబ్బింగ్ 55 లక్షలు, ఓవర్సీస్ 2 కోట్ల 55 లక్షలు రాబట్టాయి. మొత్తంగా ఫస్ట్ డే 15 కోట్లను టచ్ చేయలేకపోయింది
థియేట్రికల్ బిజినెస్ ని 90 కోట్ల దాకా చేశారు. ఇంకా బ్రేక్ ఈవెన్ చాలా దూరంలో ఉంది. వీకెండ్ నాలుగు రోజులు తీసుకున్నప్పటికీ దాన్ని వాడుకునే సూచనలు లైగర్ కు తక్కువగా ఉన్నాయి. డిజాస్టర్ టాక్ వస్తే రెండో రోజు నుంచే ఫలితం ఎలా ఉంటుందో ఆచార్య, రామారావు ఆన్ డ్యూటీ, మాచర్ల నియోజకవర్గం లాంటివి నిరూపించాయి. ఇప్పుడు లైగర్ కూడా అదే దారిలో వెళ్తే భారీ నష్టాలు తప్పవు. శని ఆదివారాలు కీలకంగా మారనున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు లైగర్ కు కనీస మద్దతు ఇచ్చేలా లేకపోవడం విషాదం. ఈ లెక్కన చూస్తే విజయ్ దేవరకొండ మొదటి ప్యాన్ ఇండియా అడుగు జారిపడినట్టే.