Idream media
Idream media
కిటి్కీ ఊచల్లోంచి ప్రపంచాన్ని చూడాల్సి వస్తుందని ఎపుడూ అనుకోలేదు. జీవితమే ఒక నాటకం అన్నారు కానీ, జీవితమే ఒక జైలు అని ఎవరూ అనలేదు. ఇకపై అంటారు. ఇల్లు అనే జైలుకి నెలనెలా అద్దె కూడా కట్టాలి.
ప్రపంచమే ఒక బిగ్‌బాస్ హౌస్‌గా మారిపోయింది. మనకున్న సౌలభ్యం ఏమంటే మోడీ అపుడపుడు కనిపించి టాస్కులు ఇస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టమంటే , చేతులు అరిగిపోయేలా కడుక్కుని మరీ కొట్టాం. కొందరు గ్లాసులు, చెంబులు, ప్లేట్లు టపటప కొట్టారు. శబ్దానికి కరోనా పారిపోతుందని అనుకున్నారు. కరోనా పోలేదు. మనమే పారిపోయి తలుపులేసుకున్నాం. దీపాలు వెలిగించమన్నాడు. దీపాలతో ఆగకుండా టపాసులు కూడా కాల్చాం. వెలుగుకి కరోనా అనే చీకటి శక్తి పారిపోతుందని పండితులు విశ్లేషించారు. కరోనా నవ్వుకుంది. పండితులు పరారీ.
అందరి దినఫలాలు ఒకేలా ఉంటాయని ఎపుడైనా ఊహించామా? బంధుమిత్రులని కలుసుకుంటారని ఎవరూ రాయడం లేదు. కలిస్తే క్వారంటైనే! బయటికి వెళ్లేటపుడు రాహుకాలాలు, దుర్ముహూర్తాలు చూసేవాళ్లు లేరు. బయట లాఠీ కాలం నడుస్తోంది. ఒక మిత్రుడి రాశి ఫలంలో వాహన యోగం అని ఉందని హడలి పోతున్నాడు. ఇపుడు వాహనమంటే అంబులెన్సే.
ఒకప్పుడు కయ్యానికి కాలు దువ్వే వాళ్లు కూడా ఇపుడు జుత్తు దువ్వడం మానేశారు. బార్బర్ షాపులు అక్కడక్కడ తెరుస్తున్నారు. నా బైరాగి స్వరూపాన్ని చూసి ఆనందంగా పిలుస్తున్నారు. నేనే భయంతో వెళ్లడం లేదు. మే 3వ తేదీ కూడా కరోనా ఆగదు. కానీ జుత్తు పెరగడం ఆగదు కదా!అప్పటికీ నాకు పూర్తిస్థాయి సన్యాసి లక్షణాలు వచ్చి ఉంటాయి. మా ఆవిడ ముందు తల వంచడం కొత్త కాదు కాబట్టి, నా తలని ఆమెకి అప్పచెబితే, చూసుకుంటుంది. టైలరింగ్ తెలిసిన చెయ్యి. తర్వాత నన్ను నేను గుర్తు పట్టకపోవచ్చు. నిన్ను నువ్వు తెలుసుకో అంటుంది వేదాంతం. నిన్ను నీకు గుర్తు లేకుండా చేస్తా అంటుంది కరోనా.
మన రూపు రేఖలు మారడం వల్ల సౌకర్యం ఏమంటే అప్పులోళ్లు కూడా మనల్ని గుర్తు పట్టలేరు. ఉత్సాహం కొద్ది పలకరించినా ఎవరో పిచ్చాడు అనుకుని వెళ్లి పోతారు.
స్త్రీ శక్తి స్వరూపిణి మాత్రమే కాదు, స్వశక్తి స్వరూపిణి కూడా. మరణం దుక్కించతగింది కాదు అని నిషే ఫిలాసఫీ చదువుతూ నేను డిఫ్రెషన్‌లో ఉండగా బాల్కనిలోంచి కనిపించిన దృశ్యం నాలో జీవనేచ్ఛని పెంచింది.
అన్ని కాలాలు మనవే అనే మనో నిబ్బరంతో అనేక మంది ఆడవాళ్లు వడియాలు పెట్టుకుంటున్నారు. కొందరు ఊరగాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కారం ఘాటుకి కరోనా కూడా పారిపోవాల్సిందే.
కరోనా ఎప్పటికీ మనలోని హాస్యాన్ని చంపలేదనడానికి ఫేస్ పుస్తకమే రుజువు. జీవితంలోని జిడ్డు ఎలా వదిలించుకోవాలో తెలియక చస్తుంటే పాత్రల జిడ్డు పోవాలంటే ఏం చేయాలి అని పోస్టు పెట్టాడు. భార్యతో తోమించుకోవడం కంటే పాత్రల్ని తోమడమే గౌరవమని చాలా మంది గుర్తించినట్టున్నారు. ఇంటింటి బాధలు చెప్పుకుని ఉపశమనం పొందడానికి వాకింగ్ కూడా లేకుండా పోయింది. వాకింగ్‌కు వెళ్లినా పోలీసులు రన్నింగ్ చేయిస్తున్నారు.
పుస్తకాలు బాగా వేగంగా చదివే అలవాటు నాకు. పాత్రల్ని చాలా వేగంగా తోముతానని ఈ మధ్యనే తెలిసింది. ఇన్నాళ్లు పుస్తకాలు , సినిమాల్లోనే పాత్రలు ఉంటాయని అనుకున్న వెర్రివాన్ని. రచయితగా మనం సృష్టించకపోయినా మన కోసం చాలా పాత్రలు సింక్‌లో ఎదురు చూస్తుంటాయి.
నోట్ల వల్ల కూడా కరోనా వస్తుందని అంటున్నారు. అసలు కరోనా వచ్చిందే డబ్బు వల్ల. ఈ ప్రపంచమంతా డబ్బు పిచ్చిలో పడి పరుగులెత్తి , ఇపుడు ఆయాసంతో ఊపిరి తీసుకోడానికి భయపడి మాస్కులు వేసుకుంటూ ఉంది.
ఈ మధ్య ఒక మిత్రుడు ఫోన్‌చేసి కరోనా మీద కవిత్వం రాశాను వింటావా అన్నాడు. ఇంతకు మునుపైతే ట్రాఫిక్‌లో ఉన్నా గురూ అని తప్పించుకునే వాన్ని. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులే తప్ప ట్రాఫిక్ లేదు. భయంగానే చెప్పమన్నాను.
కరోనా కరవాలానికి
నన్ను నేను విరాళంగా ఇస్తా
కనిపించని చీకటిలో
మోడీ చేతిలో దీపమై వస్తా….
ఇంటి దీపమని ముద్దెట్టుకుంటే మోడీతో పాటు , కవులు కూడా మూతి కాలుస్తారు. వీడి ఫోన్ ఎత్తడం, అంబులెన్స్‌కు ఫోన్ చేయడం రెండూ ఒకటే.
ఈ మధ్య కొత్తచెరువు అనే ఊళ్లో పాలు పోసే కుర్రాడికి కరోనా వచ్చింది. పాలు పోయించుకునే కుటుంబాలు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాయి. పాలు కూడా ఒక్కోసారి కష్టాలపాలు చేస్తాయి.
ఒక కుర్రాడు డైరెక్టర్ కావాలని హైదరాబాద్ వచ్చాడు. డైరెక్టర్ కాకుండానే కరోనా వచ్చింది. కథ మీద కూచున్నానని ఫోన్ చేశాడు. ఫిల్మ్‌నగర్‌లో చాలా మంది కథల్ని పొదుగుతున్నారు.
మనకి కలల్ని అమ్మడం సినిమాల పని. కలని ఎంజాయ్ చేయాలంటే ముందు నిద్ర రావాలి. కరోనా మనల్ని నిద్రపోనివ్వడం లేదు.
మోడీ 7 సూత్రాలైతే చెప్పాడు కానీ, నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం ఎలా? అది చెప్పడుగా!