Idream media
Idream media
జీవితమంటేనే అనేక సంఘటనలు. సాధారణంగా జరిగేవి కూడా నాకు మాత్రం ప్రత్యేకంగా జరుగుతాయి. ఏదైనా చినిగి చాటవుతుంది. ఎవరికీ ఎదురు కాని విచిత్రాలు ఎదురవుతాయి. ఈ మధ్య మాల్‌కి వెళితే స్కూటర్ తాళం పోయింది. తాళాల రిపేరు మనిషి ఎక్కడుంటాడో తెలియదు. చాలా సేపు బుర్ర పనిచేయలేదు. ఒకాయన వచ్చి సెక్యూరిటీ వాళ్లని అడగండి అన్నాడు. అడిగితే హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్లమన్నాడు. మాల్‌లో మన వస్తువులు పోతే, సెక్యూరిటీకి దొరికితే అక్కడ ఉంచుతారు. తాళం చేతికొచ్చాక ఆనందమే వేరు.
అర్జెంట్‌గా వెళ్లాలని ఆటో ఎక్కితే అతను నేరుగా బంకుకు వెళ్లి 10 నిమిషాలు ముచ్చట్లు పెట్టుకుని తీరిగ్గా ఆయిల్ కొట్టిస్తాడు. మణికొండ నుంచి మెహదీపట్నం సిటీ బస్సు ఎక్కితే అది దారిలో చెడిపోయింది. ఇంకో బస్సు ఎక్కితే అది కూడా పెద్ద కుదుపులతో ఆగిపోయింది. వెంటవెంటనే రెండు బస్సులు చెడిపోవడం రికార్డ్. సర్వీస్ ఆటో ఎక్కితే హ్యాండిల్ గజగజ వణుకుతోంది. సర్వశక్తులతో డ్రైవర్ హ్యాండిల్ చేస్తూ వుంటే ఒక గోతిలోకి దిగిన చక్రం మళ్లీ పైకి లేవలేదు. మణికొండ మున్సిపాలిటీ అయిన తర్వాత చిన్న గోతులన్నీ పెద్దవయ్యాయి, మంచి అభివృద్ధి.
రెండేళ్ల క్రితం అత్తాపూర్‌లోని మాల్‌కి సినిమాకు వెళ్లాను. ధనుష్ “రైల్”కి అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకుని వెళితే సినిమా వేయలేదు. నేనొక్కడినే ప్రేక్షకున్ని. థియేటర్ వాళ్లు బతిమాలి పింక్ సినిమాకి పంపారు. వారం క్రితం ఫిల్మ్‌నగర్ అపోలో ఆస్పత్రి వద్ద నా స్కూటర్‌ని మారుతీకార్ గుద్దింది. ఆస్పత్రి దగ్గర యాక్సిడెంట్ కావడం కూడా అదృష్టమే. అయితే ఏంకాలేదు. కారు డ్రైవర్ దిగి క్షమించమని అడిగాడు. అతని తండ్రిని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారట! ఆ టెన్షన్‌లో ఉన్నాడట, క్షమించేశాను.
జాక్‌సన్‌విల్లి (ఫ్లోరిడా ) లో నేను మా అబ్బాయి ఒక రెస్టారెంట్‌కి వెళితే అమెరికన్ కుర్రాడు నన్ను రాసుకుంటూ వెళ్లాడు. సారీ చెప్పాడు. వాష్ రూం నుంచి వస్తూ మళ్లీ తగిలాడు. గొడవ పెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడని అనుమానం వచ్చింది. మళ్లీ సారీ చెప్పాడు. నేను మా అబ్బాయి కలిసినా అతన్ని ఎదుర్కోలేం. అంత బలంగా వున్నాడు. వాడితో గన్ వుండే అవకాశం ఎక్కువ. భయమేసింది.
రెండు నిమిషాల తర్వాత నా టేబుల్ మీదికి బోర్‌బన్ (అమెరికన్ విస్కీ) గ్లాస్ వచ్చింది. అపాలజీ కోరుతూ ఆ కుర్రాడు డ్రింక్ ఆఫర్ చేశాడు. మర్యాదస్తుడే.
తగిలిన ప్రతిసారీ విస్కీ పంపితే , ఇంకో రెండుసార్లు తగిలినా అభ్యంతరం లేదు.
35 ఏళ్ల క్రితం తాడిపత్రి నుంచి ఆలూరుకోన వెళ్లాల్సిన బస్సుని ఆఖరి క్షణంలో ఎక్కలేదు. దానికి ఘోరమైన ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారు. 30 ఏళ్ల క్రితం తిరుపతిలో ఒక అర్ధరాత్రి పిచ్చోడు నా గొంతుకి కత్తి పెట్టాడు. ఏం జరిగిందో తెలిసేలోగా నువ్వు కాదులే అని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రోడ్డు పక్కన బట్టలు లేకుండా తిరిగే పిచ్చోళ్లంటే భయం. వాళ్ల రియాక్షన్‌ని మనం ఊహించలేం.
రేణిగుంట రోడ్డులో ముందు వెళుతున్న దుంగల లారీ నుంచి ఒకటి జారి నా స్కూటర్ ముందు పడింది. కొన్ని అడుగులు ముందున్నా అది నా నెత్తిన పడేది. తలకోనలో మునిగిపోతున్న నన్ను ఒక కుర్రాడు రక్షించాడు. అతనెవరో తెలియదు. రూపం కూడా గుర్తు లేదు. బహుశా దేవుడేమో!
చిన్నాచితకా రోడ్డు యాక్సిడెంట్స్‌కి లెక్కలేదు. ఒక తాగుబోతును రక్షించబోయి రేణిగుంట బషీర్ ఆస్పత్రిలో మూడు ఇంజెక్షన్లు వేయించుకున్నా. మెహదీపట్నంలో రఫ్ గా తోలుతున్న ఒక కుర్రాడు బైక్‌తో ఢీకొట్టాడు. వెనుక వస్తున్న కారు బ్రేకులు పని చేయడం వల్ల బతికిపోయాను.
లైఫ్ జాకెట్స్ వున్నాయని నమ్మించి ఒక జాలరి సముద్రంలోకి తీసుకెళ్లాడు. పడవ ఎక్కిన తర్వాత లేవని చెప్పాడు. సముద్రానికే ఇష్టం లేక వదిలేసింది. కావేరీ నదిలో మొసళ్లు లేవని చెబితే నమ్మి ఈత కొట్టాం. అక్కడికి కొంచెం దూరంలో ఒక బండ మీద విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది.
అనవసరంగా వంటకి దిగితే కుక్కర్ పేలింది. స్టౌ మీద పాలు పెట్టి తాళం వేసుకుని బయటికి వెళ్లిపోయిన సంఘటనలు ఎన్నో.
ఒక టిఫెన్ సెంటర్‌లో చట్నీ వేసుకుందామని వెళితే టేబుల్‌పై పెట్టిన 20 వేల రూపాయల ఫోన్ పోయింది. ఈ మధ్య పాన్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ పోయాయి. సజావుగా జరిగేవి కూడా ట్విస్టులు ఇస్తాయి. నాకు మాత్రమేనా, అందరికీ ఇలాగేనా? నాకు తెలియదు.
గచ్చిబౌలిలో లినెన్‌క్లబ్ పెద్ద షోరూం ఉందని గూగుల్‌లో వెతికి క్యాబ్‌లో మా ఆవిడతో వెళ్లాను. అక్కడికి వెళితే కరెంట్ లేదు, జనరేటర్ కూడా లేదు. సెల్‌ఫోన్ వెలుతురులో బట్టలు సెలెక్ట్ చేసుకోమని సేల్స్ గర్ల్ చెప్పింది. మా ఆవిడ నన్ను చూసిన చూపులతో చలీ జ్వరం వచ్చింది.
కూరగాయల షాపులో 300 బిల్లుకి బదులు ఫోన్ పేలో 3 వేలు కొట్టాను. అది వాళ్ల ఓనర్ నెంబరట. అతను అక్కడ లేడు. నాలుగు సార్లు ఫోన్ చేసి నానా తిప్పలు పడి డబ్బులు వెనక్కి తెచ్చుకున్నాను.
తిరుపతి నుంచి అనంతపురానికి ఆర్టీసీ టికెట్లు బుక్ చేయమంటే రాత్రికి బదులు పగలు 10 గంటలకి చేశాను. చేసింది ఉదయం 9 గంటలకి. మొత్తం ఆర్టీసీ వాళ్లకి డొనేషన్.
ఒకసారి రేణిగుంట ఆంధ్రజ్యోతి నుంచి తిరుపతి వస్తూ వుంటే ఆటో వెనుక టైర్ ఊడిపోయింది. రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. దుమ్ము,ధూళి, ట్రాఫిక్, ప్రయాణాలు, జర్నలిజం ఇన్నిటి నుంచి బతికి బయట పడ్డాను. కాబట్టి కరోనా వచ్చినా ఏమీ చేయలేకపోయింది. కరోనాకి భయపడలేదు కానీ, ముక్కులో పుల్ల పెట్టి మజ్జిగ కవ్వంలా చిలుకుతారే దానికి మాత్రం దేవుడు కనిపించాడు.