Idream media
Idream media
ఎంత గొప్ప పడవైనా ఎక్కడో ఒక చోట లంగర్ వేయాల్సిందే. పరుగు ఆగాల్సిందే. ప్రతి సౌందర్యం నశించాల్సిందే. సృష్టి మొదలై నప్పటి నుంచి ప్రకృతి తన నియమాలను స్పష్టంగా వివరిస్తూ వున్నా మనిషి దాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నాడు. మేకప్ లేకుండా నటించే రంగస్థలం ఈ ప్రపంచం. మన చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక నాటకం నడుస్తూ వుంటుంది. నిమిత్తం లేకుండా పాత్రదారులుగా వుంటాం. ఒక్కోసారి ఓవరాక్షన్ కూడా చేస్తుంటాం. పలికే ఏ డైలాగ్‌కి ప్రాంప్టింగ్ అక్కర్లేదు. మనసే పెద్ద ప్రాంప్టర్.
పులులకి బౌద్ధం ఉపదేశిస్తే ఏం ప్రయోజనం. వేటాడకపోతే అవి చచ్చిపోతాయి. ఆకలిని జయించడానికి అన్ని నియమాలు ఉల్లంఘనకు గురి అవుతాయి. మనుషులు కూడా నిరంతరం వేటాడుతూ వుంటారు. వీళ్లలో విల్లంబులతో వేటాడే వాడే అతి తక్కువ ప్రమాదకారి.
మాట్లాడ్డానికి మనుషులు కావాలి. చెప్పేవాళ్లు ఎక్కువై, వినేవాళ్లు తక్కువై పోయారు. రక్తం గడ్డ కడితే గాయం, మాటలు గడ్డ కడితే మౌనం. మాటలు ప్రవహించాలంటే వేడి కావాలి. రక్తనాళాల్లో ఆ వేడి కరువైంది. జీవితంలో ఇతరుల్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. జీసస్‌నే మోసం చేశారు. ఇక సాధారణ మనుషులోలెక్క. తీగ మీద నడవడమే జీవనం అయినప్పుడు తీగ తెగకుండా చూసుకోవాలి. వాయులీనంలో ఏ రాగమూ పలకకపోతే అది మరణం.
ఊహ వచ్చే సరికి మన లోపల వుండే ఆత్మ … అంటే నేను అనే చైతన్యం, స్పురణ చనిపోయే వరకూ మారదు. మొహం, శరీరం మారుతూ వుంటుంది. బాల్యం , యవ్వనం అలా వచ్చి తమ ముద్రల్ని వేసి వెళ్లిపోతాయి. నడి వయసు భయపెడుతుంది. ముసలితనం అనే చీకటి కమ్ముకుంటూ వుంటుంది. చీకటి తప్పదని తెలుసు, కాని కొంచెం ఆలస్యమైతే బావుండనే ఆలోచన. మనం ఏమనుకుంటున్నామో అనే దృష్టితో ఈ లోకాన్ని చూడ్డం వల్ల ప్రయోజనం లేదు. మన భావాలకి అనుగుణంగా ఇతరులని చూస్తే వాళ్లు ఎన్నటికీ అర్థం కారు.
నదిలో అనేక జలచరాలుంటాయి. వరదొచ్చినపుడు కొట్టుకుపోతూ వుంటాయి. ఎదురీత లక్షణం నూటికో కోటికో ఒక్కరికుం టుంది. పులస చేపను చూసి అందరూ నవ్వే వుంటారు. కానీ అది సాహసం చేసి పులుసై పోతుంది. సాహసం జీవ లక్షణమై నపుడు వలలో దొరక్కుండా వుండే నైపుణ్యం కూడా కావాలి. ఆధునిక సమాజాన్ని పీడిస్తున్న అసలుసిసలైన సమస్య నైపుణ్యం. నిపుణతతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లో చెత్త పేరుకుపోతూ వుంది. వీళ్లకే అవార్డులు, బిరుదులు , సన్మానాలు. గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికంటివాడిని కూడా బతకనియ్యరు.
చలనమే జీవన సూత్రం. కదలకుండా వుండే నీళ్లు పాచిపట్టి పోతాయి. దుర్వాసన వస్తాయి. మనిషైనా అంతే. కదలిక శరీరానికే కాదు ఆత్మకి కూడా వుండాలి. ఆత్మని పంజరంలో బంధించి , ఎగిరే స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఇప్పటి ట్రెండ్. మనం ఏమైతే కాదో దాని గురించే మాట్లాడుతూ వుండడం మోడ్రన్ ఆర్ట్.
మనిషి తన జీవితం మాత్రమే విలువైందని అనుకుంటాడు. కానీ ఒక పక్షికి దాని జీవితం, ఒక చీమకి దాని బతుకు ఎంతో విలువైనవి. పులి మీద పడుతున్నపుడు జింక తన శాయశక్తులా పోరాడుతుంది. ఓడిపోవచ్చు, కానీ నిశ్శబ్దంగా ఓడిపోదు. మనుషులే చాలా సార్లు ప్రతిఘటన లేకుండా ఓడిపోతూ వుంటారు. ప్రతిదానికి ఓటమి వుంటుంది. పులి ఎంత గొప్ప వేటగత్తె అయినా ఏదో ఒకరోజు అది అలసిపోతుంది. ముసలిదై పోతుంది. వృద్ధాప్యం కూడా ఒక రకమైన పరాజయమే.
నీళ్లలో దిగేవాడికే చేపలు దొరుకుతాయి. గేలానికి దొరికేది ఒక చేపే. వల విసిరితే వంద చేపలు. వలలు తయారు చేసే వాళ్లే శాఖాహారం గురించి ఉపన్యాసాలు ఇస్తూ వుంటారు. నీడని కూడా మోసం చేసే వాళ్లు విశ్వాసాలు, నమ్మకాల గురించి మాట్లాడ్తూ వుంటారు. ఇదే లోకం.
Also Read : ఈ అడవిలో వేటాడాలి లేదా నిన్ను వేటాడేస్తారు