Idream media
Idream media
చాలా చిన్నప్పుడు రంగులరాట్నం సినిమా చూశాను. పరమ ఏడుపు సినిమా అనిపించింది. డప్పు కొడుతూ పాట పాడిన చంద్రమోహన్ మాత్రం గుర్తున్నాడు. అయితే ఆయన కోసం సినిమాకి వెళ్లింది ఎపుడూ లేదు. హీరోలంటే NTR, ANR తర్వాత కృష్ణ, శోభన్. ఫైటింగులు చేస్తేనే హీరో. అల్లూరిసీతారామరాజులో కొంచెం గుర్తు పట్టాను. కురుక్షేత్రంలో అభిమన్యుడుగా వేస్తే నవ్వుకున్నాం. చనిపోయిన సీన్‌లో ప్రశాంతంగా వూపిరి తీసుకుంటూ కనిపిస్తాడు.
సీతామాలక్ష్మి టైంకి టెన్త్‌క్లాస్ దాటాను. చంద్రమోహన్ నటన డెప్త్ అర్థమైంది. పదారేళ్ల వయసుని శ్రీదేవి కోసమే చూసినా చంద్రమోహన్ నటన మరిచిపోలేం. శంకరాభరణంలో వున్నాడు కానీ షో అంతా శంకరశాస్త్రిదే. చంద్రమోహన్ బ్యాడ్‌లక్ ఏమంటే సినిమా హిట్ అయినా క్రెడిట్ ఇంకెవరికో వెళ్లేది. సిరిసిరిమువ్వతో జయప్రద, ఎక్కడికో వెళ్లింది కానీ, చంద్రమోహన్ అక్కడే వుండిపోయాడు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలు చూశాకానీ పేర్లు చెప్పమంటే ఐదారు కూడా చెప్పలేను. ఆయనకంటూ ఒక స్టయిల్ మానరిజం వుండదు. అందుకే మిమిక్రీకి దొరకడు.
హీరోగానే వుండాలని ఆయనా అనుకోలేదు. అందుకే వందల సినిమాల్లో నటించాడు. ఫీల్డ్‌కి వచ్చి 56 ఏళ్లయినా ఇంకా అందరికీ గుర్తున్నాడు. అద్భుతంగా నటించిన సినిమాలు ఎన్ని వున్నాయో తెలియదు కానీ, చంద్రమోహన్ చెత్తగా నటించిన సినిమా ఒక్కటి కూడా లేదు. అదే ఆయన గొప్పతనం. సినిమా రంగంలో వివాదాలు లేకుండా సౌమ్యంగా జీవించడమే అతి పెద్ద సక్సెస్. అది సాధించాడు. మే 23కి 81 ఏళ్లు. చూడడానికి అలా కనిపించడు. పొట్టివాడే కానీ గట్టివాడు. డబ్బు దగ్గర పిసినారి, గట్టి మనిషి అని పేరున్న వాడు. ఆయనకి కూడా బోలెడు డబ్బు ఎగ్గొట్టారంటే మన నిర్మాతలు ఇంకెంత గట్టి పిండాలో!