iDreamPost
android-app
ios-app

Election Notification – మినీ స్థానిక పోరుకు నగారా మోగింది

Election Notification – మినీ స్థానిక పోరుకు నగారా మోగింది

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికకు నగారా మోగింది. ఈ ఏడాది ప్రారంభం, అర్థభాగంలో జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో.. వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఈ రోజు ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌తోపాటు మున్సిపల్‌ ఎన్నికలకు ఒకే సారి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు, పలు డివిజన్లు, వార్డులకు, 69 గ్రామ పంచాయతీలు, 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీ స్థానాలు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14వ తేదీన పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్‌ చేపట్టనున్నారు. 15వ తేదీన నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు. 16వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు, 18వ తేదీన కౌటింగ్, ఫలితాలు ప్రకటించబోతున్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.

Also Read : Huzurabad Bypoll – సర్వేలు నిజమవుతాయా..?