iDreamPost
android-app
ios-app

రాజకీయాల్లో గాన కోకిల

రాజకీయాల్లో గాన కోకిల

భారత గాన కోకిల లతా మంగేష్కర్‌ సంగీత సామ్రాజ్యంలో మకుటంలేని మహారాణి. ఆమె లేరన్న విషయం తెలిసి సంగీత ప్రపంచమే కాదు.. సప్తస్వరాలూ శోకసంద్రంలో మునిగిపోయాయి. మెలోడీ క్వీన్‌గా ఆమె స్వరం శ్రోతల హృదయాల్లో నిలిచిపోయింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా పాల్స్‌ఖేడా గ్రామంలోని ఓ పొలంలో సీతాఫలాలకు లతా మంగేష్కర్‌ అని పేరుపెట్టారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత కవి, రైతు నామ్‌దేవ్‌ ధోన్డో మహనోర్‌కు చెందిన పొలం అది. ‘‘ఆ పొలం బంజరు భూమిలో ఉన్నప్పటికీ అందులో పండిన సీతాఫలాలు తియ్యగా ఉంటాయి. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకున్న తర్వాత కూడా పండ్లు మాధుర్యాన్ని కోల్పోవు. అలాగే లతాజీ తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయినా ఆమె తన తోబుట్టువులను వెంట తీసుకుని ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆమె పాటలు వింటున్నప్పుడల్లా మా పొలంలోని సీతాఫలం తింటున్నట్లు ఉండేది. సీతాఫలాలు తింటుంటే ఆమె పాట వింటున్నట్లు ఉండేది. అందుకే మా పొలంలో పండిన సీతాఫలాలకు ‘లతాఫల్‌’ అని పేరుపెట్టాం’’ అని మహనోర్‌ గుర్తుకు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా.. సంగీత ప్రపంచంలోనే కాదు.. లతా మంగేష్కర్‌ రాజకీయ యువనికపై కూడా మెరిశారు. రాజ్యసభ సభ్యురాలిగా ఆరేళ్లు పనిచేశారు. అయినప్పటికీ ఈ ఆరేళ్ల కాలంలో ఆమె ఎటువంటి భత్యాలూ తీసుకోలేదు. 1999 నవంబరు 22 నుంచి 2005 నవంబరు 21 వరకు బీజేపీ మద్దతుతో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమెకు చేసిన చెల్లింపులన్నీ ఆమె తిరిగి ఇచ్చారని ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఆరేళ్లలో ఆమె 12 రోజులే సభకు హాజరయ్యారు. రైళ్లు పట్టాలు తప్పడంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఒకసారి ప్రశ్నించారు. ‘‘నాకు ఇష్టం లేకపోయినా, రాజకీయాల గురించి నాకు తెలియకపోయినా నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. రాజకీయాల్లోకి రావాలని నాపై ఒత్తిడి చేసిన వారికి నేను వద్దనే చెప్పాను. రాజకీయాల గురించి నాకేం తెలుసని చెప్పినా వినలేదు’’ అని ఓ ఇంటర్వ్యూలో లతాజీ వెల్లడించారు.

2002 మార్చి 21 నాటి ఉగ్రవాద వ్యతిరేక ఆర్డినెన్స్‌ను ఉగ్రవాద నిరోధక బిల్లుగా (పోటా) మార్చడానికి నాడు పార్లమెంటులో ఓటింగ్‌ జరుగుతోంది. ఎన్డీఏ నేతలందరూ ఆ సమావేశానికి హాజరయ్యేలా చూసే బాధ్యతను నాటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ తీసుకున్నారు. బిల్లుకు లతాజీ అనుకూలంగా ఓటు వేశారు. అయితే రాజ్యసభలో తగినంత బలం లేక ఈ బిల్లు చట్టరూపం దాల్చలేకపోయింది.