iDreamPost
android-app
ios-app

ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన మ‌రో కుంభ‌కోణం ఏపీ ఫైబర్ గ్రిడ్. వైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చాక ఈ స్కాం డొంక క‌దులుతోంది. నాడు ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు తనయుడు లోకేష్.. హయాంలోనే ఈ స్కాం జరిగింది. ఇక ఇదంతా కట్టుకధేనని.. ఎలాంటి అక్రమాలు జరగలేదని.. టీడీపీ తరఫున పట్టాభి రాం లాంటి నేత‌లు వాదిస్తున్నా.. అధికారుల విచార‌ణ‌లో వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దాదాపు 121 కోట్ల కుంభ కోణం దీనిలో దాగి ఉందని ఫైబర్ గ్రిడ్ ప్రస్తుత చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి, వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. రాజ‌కీయంగా వాద‌న‌లు ఇలా ఉంటే.. మరో వైపు.. ఈ కేసులో విచారణను సీఐడీ వేగవంతం చేసింది.

దేశవ్యాప్తంగా గ్రామాలను ఇంటర్నెట్ తో అనుసంధానం చేసే ప్రక్రియను అప్పట్లో మోదీ ప్రభుత్వం ప్రారంభించగా, ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో.. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం తమ జేబులు నింపుకోవాలని చూసింది. ఈ క్రమంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ తన సన్నిహితుడు హరికృష్ణ ప్రసాద్ కి చెందిన టెరా సాఫ్ట్ కి టెండర్లు కట్టబెట్టారు. దాని ఖరీదు అక్షరాలా 330 కోట్ల రూపాయలు. అప్పటికే ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉండగా.. నిబంధనలు మార్చి బ్లాక్ లిస్ట్ లో నుంచి హడావిడిగా ఆ కంపెనీపేరు తొలగించి లాంఛనం పూర్తి చేశారు. ఈ క్రమంలో కొన్ని పత్రాలు ఫోర్జరీ చేశారని కూడా ఆరోపణలున్నాయి. టెక్నికల్ కమిటీలో తమవారినే నియమించుకుని, ఒకరిద్దరు అభ్యంతరం తెలిపినా వాటన్నిటినీ పక్కనపెట్టి 330 కోట్ల రూపాయల విలువైన ఫైబర్ నెట్ టెండర్లను టెరా సాఫ్ట్ కి కట్టబెట్టారు. దీనిపై అప్పట్లో ఆరోపణలు వచ్చినా టీడీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించింది.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ కుంభ‌కోణం బ‌య‌ట‌పెట్టారు. విశాఖ జిల్లాలోని ఓ గ్రామాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది అప్పటి చంద్రబాబు-లోకేష్ ప్రభుత్వం. తన పాదయాత్రలో భాగంగా ఈ గ్రామానికి చేరుకున్న జగన్.. అసలు అక్కడ ఎలాంటి ఫైబర్ నెట్ లేదని తెలుసుకున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏ గ్రామంలోనైతే ఫైబర్ నెట్ ప్రయోగాత్మకంగా లాంఛ్ అయిందో, ఆ గ్రామస్తులకు దాని గురించి కనీసం తెలియదు కూడా. తను అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రిడ్ కథ అంతుతేలుస్తానని అప్పట్లోనే జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా ఫైబ‌ర్ నెట్ కేసులో సీఐడీ అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. వేమూరి హరిప్రసాద్ సాంబశివరావు గోపీచంద్కు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోని కొంతమంది పెద్దలు టెరాసాఫ్ట్ పేరుతో ఏ విధంగా టెండర్లు దక్కించుకున్నారన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయని కూడా ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి కూడా చెబుతున్నారు. టెరాసాఫ్ట్ ఎండీగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్ 2015లో టెండర్లు పిలిచే సమయానికి ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయించి ఏపీఎస్ఎఫ్ఎల్ టెండర్ల పరిశీలన కమిటీలో సభ్యునిగా నియమించార‌ని, అలాగే ఏడాదిపాటు బ్లాక్లిస్ట్లో ఉన్న ఆ సంస్థను కేవలం రెండు నెలల్లోనే నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారని పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఈ కేసు ద‌ర్యాప్తు వేగంగా జ‌రుగుతోంది. ఆరోప‌ణ‌లు నిజ‌మైతే అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.