iDreamPost
android-app
ios-app

రైతన్నలకు సీఎం జగన్ శుభవార్త..

రైతన్నలకు సీఎం జగన్ శుభవార్త..

ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు త్వరలో పరిష్కారం లభించబోతోంది. భూమిపై హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, అధికారులను ప్రశన్నం చేసుకునేందుకు ఇకపై అన్నదాతలు కష్టాలు పడాల్సిన పని లేదు. అధికారులకు తమ కష్టార్జితాన్ని లంచాల రూపంలో ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను చూసిన, విన్న రైతన్న కష్టాలను తీర్చేందుకు ఇచ్చిన సమగ్ర భూ సర్వే హామీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని సర్వే చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాలకు అవసరమైన సరంజామాను వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. మరో రెండు నెలల్లో సమగ్ర భూ సర్వే ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులకు ఈ అంశంపై జరిగిన సమీక్షలో దిశానిర్ధేశం చేశారు. 2021 జనవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే ప్రారంభం కావాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. మూడు దశల్లో జరిగే ఈ సర్వే 2023 జనవరి నాటికి పూర్తవ్వాలని లక్ష్యం నిర్ధేశించారు. అంటే రెండేళ్లలో సమగ్ర భూ సర్వే పూర్తవ్వనుంది.

ప్రతి మండలానికి మూడు బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాలు ఈ సర్వేలో పాల్గొననున్నాయి. సర్వే కోసం అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపగ్రహ ఛాయా చిత్రాలు ఉపయోగించుకోనున్నారు. భవిష్యత్‌లో భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా రికార్డులను డిజిటలైజేషన్‌ చేయనున్నారు. భూ వివాదాలు ఏమైనా ఏర్పడితే గ్రామాల్లోనే కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగానే భూ వివాదాలను పరిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు రూపాయి ఖర్చు లేకుండా వారి భూ సమస్యలను వైసీపీ ప్రభుత్వం తీర్చనుంది.