iDreamPost
android-app
ios-app

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మరో క్యాలెండర్‌..

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మరో క్యాలెండర్‌..

అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ముందస్తు షెడ్యూల్‌తో క్యాలెండర్‌ ప్రకటించి అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఈ దిశగా మరో క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఏడాది ముగింపు గుర్తిండిపోయేలా నాలుగు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం జగన్‌ రూపకల్పన చేశారు. డిసెంబర్‌ నెలలో వీటిని అమలు చేయనున్నారు. వీటికి ఈ రోజు ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

డిసెంబర్‌ 2:

ఏపీలో అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. తొలి దశలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సహాకార సంఘాల ద్వారా అమూల్‌– రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పాలు సేకరిస్తాయి. ఇందు కోసం రైతు భరోసా కేంద్రాల పక్కనే బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. పాడి రైతులకు మార్కెట్‌ధర కన్నా లీటర్‌కు నాలుగు రూపాయలు ప్రోత్సాహకం ప్రభుత్వం అందజేయనుంది. డిసెంబర్‌ 2వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రోత్సాహక నగదును రైతుల ఖాతాల్లో జమచేసే విధానాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

డిసెంబర్‌ 10 :

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకం కింద మహిళలకు రెండు లక్షల గొర్రెలు, మేకలు పంపిణీని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. ఈ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకున్న మహిళలకు రెండు లక్షల గొర్రెలు, మేకలు పంపిణీ చేయనున్నారు. యూనిట్‌కు 14 గొర్రెలు లేదా మేకల చొప్పన లబ్ధిదారులకు అందజేస్తారు.

డిసెంబర్‌ 21 :

ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రకటించిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ డిసెంబర్‌ 21వ తేదీన ప్రారంభించనున్నారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం పేరుతో చేసే ఈ భూముల రీ సర్వేలో రైతులకు రూపాయి ఖర్చు లేకుండా వారి భూములపై హక్కులు కల్పించనున్నారు. అత్యాధునిక కార్స్‌ సాంకేతిక పరిజ్ఞానంతో భూములను రీ సర్వే చేయనున్నారు. మూడు దశల్లో జరిగే ఈ రీ సర్వే కోసం మండలాన్ని మూడు భాగాలుగా విభజించారు. తొలి దశ సర్వే ఈ నెల 21వ తేదీన ప్రారంభం కాబోతోంది. సర్వే కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తయింది.

డిసెంబర్‌ 25 :

రాష్ట్రంలో సొంత ఇళ్లు, ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం ఇచ్చేందుకు రూపాందించిన ఇళ్ల పట్టాల పంపిణీ పథకం డిసెంబర్‌ 25వ తేదీన ప్రారంభం కాబోతోంది. 30 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభిచనున్నారు. అదే రోజు తొలిదశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 1.80 లక్షల విలువైన ఇంటిని ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వనుంది.