Idream media
Idream media
రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం నేడు మంగళవారం ప్రారంభమైంది. భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే పైలెట్ ప్రాజెక్టును కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ల పాడు గ్రామంలో మొదలైంది. అత్యాధునిక క్రాస్ నెట్ వర్క్ తో భూముల రీసర్వే చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్నినాని లాంఛనంగా ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వందేళ్ల క్రితం సమగ్ర భూసర్వే జరిగిందని.. భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. న్యాయస్థానాల్లో 60 శాతం పైగా భూ వివాదాలే నడుస్తున్నాయని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో కూడా భూ వివాదాలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. భూ వివాదాలకు చెక్ పెట్టటమే భూముల రీ సర్వే ప్రధాన ఉద్దేశమన్నారు.
Read Also: భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల రీసర్వే ప్రారంభించిన జగన్ సర్కార్
రెవెన్యూ రికార్డుల తయారీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చూడబోతుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. భూములు కొనుగోలు చేయడం సులువేనని.. కానీ ఎమ్మార్వో కార్యాలయంలో పాస్ బుక్కులు తీసుకురావడం చాలా కష్టమన్నారు. ముందు వీఆర్వోకు నచ్చాలి. . తర్వాత ఆర్ఐ, తహసిల్దారు వద్ద ఎక్కడా రిజెక్ట్ కాకుండా ఆమోదించుకోవాల్సి ఉందన్నారు. సర్వే చేయించడం సహా పాస్ పుస్తకాలు సంపాదించాలంటే తల ప్రాణం తోకకి వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. రైతుల కష్టాలు తీర్చడం సహా వారికి ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.