iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి భార్య భూ బాగోతం

హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి భార్య భూ బాగోతం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భూ దందా వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలంగాణ రాష్ట్రంలోనూ భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇక్కడ పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ ఈ దందాను నడిపారనే ఫిర్యాదుతో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.

హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన జూబ్లిహిల్స్‌లో పత్తిపాటి భార్య వెంకాయమ్మ భూ ఆక్రమణకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. జూబ్లిహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన 1,519 గజాల స్థలాన్ని ఆమె ఆక్రమించారని సోసైటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్వే నంబర్‌ 853 ఎఫ్‌లోని ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని చెబుతూ.. నిన్న రాత్రి వెంకాయమ్మ తన అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారని జూబ్లిహిల్స్‌ సొసైటీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ స్థలంలో ఉన్న బోర్టును కూడా తొలగించి.. ఆ స్థలం తాను కొనుగోలు చేశానంటూ ఆమె వాదిస్తున్నారు.

వెంకాయమ్మ సొసైటీ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారని, బెదరింపు ధోరణితో మాట్లాడారంటూ వచ్చిన ఫిర్యాదుపై జూబ్లిహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భూ బాగోతంపై దర్యాప్తు మొదలుపెట్టారు. కొనుగోలు చేశానంటున్న వెంకాయమ్మ అందుకు సంబంధించిన పత్రాలను చూపించాల్సి పరిస్థితి తాజాగా నెలకొంది. కొనుగోలు చేసినట్లుయితే.. ఎవరి వద్ద ఎప్పుడు..? కొనుగోలు చేశారు..? లింక్‌ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అవి నకిలీవి అయితే.. పత్తిపాటి భార్య చిక్కులు ఎదుర్కొక తప్పదు.

ఇప్పటికే మాజీ మంత్రి పత్తిపాటి అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో కేసులు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఏపీ సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. రాజధానిగా ప్రకటించకముందే అక్కడ పత్తిపాటి భూములు కొన్నారని, అందులో అసైన్మెంట్‌ భూములు కూడా ఉన్నాయనేది ప్రధాన అభియోగాలు. ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి భూ అక్రమాలపై విచారణ నిలిచింది. ఇక్కడ తాత్కాలింగా ఉపసమనం లభించగా.. తాజాగా జూబ్లిహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ భూ కబ్జా వ్యవహారంలో భార్య వెంకాయమ్మతోపాటు పత్తిపాటికి కూడా చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.