Idream media
Idream media
ఇంటిపై ఉండి పిల్లలు రాళ్లు వేశారు.. ఆడవాళ్లు ఒళ్లో కారం పెట్టుకుని చల్లారు.. కర్రలతో మోదారు.. మగవాళ్లు పొలాలకు పురుగుమందులు కొట్టే స్ప్రేయర్‌తో పెట్రోల్ స్ప్రే చేశారు.. ఆ వెంటనే మరికొంత మంది కత్తులు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు.. దొరికిన వారిని దొరికినట్లు నరికారు.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ఘటన.. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం కామవరంలో గురువారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదం నేపథ్యంలో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. హతులు ఇద్దరు స్థానిక సర్పంచ్ సోదరులు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కామవరంలో నివాసం ఉంటున్న మల్లికార్జున సోదరులు ఐదుగురు స్థానికంగా ఏడు ఎకరాల పొలం కౌలుకు చేసుకుంటున్నారు. ఈ పొలం ఆదోని లో ఉంటున్న మునీంద్రకు చెందినది. దాదాపు 20 ఏళ్లుగా ఆ పొలాన్ని మల్లికార్జున కుటుంబం కౌలుకు చేసుకుంటోంది. 12 ఏళ్ల క్రితం మునీంద్ర పొలాన్ని బేరానికి పెట్టగా.. మల్లికార్జున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఆ తర్వాత మిగతా సొమ్ము చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మునీంద్ర కొరగా.. మల్లికార్జున నుంచి స్పందన లేదు. పలుమార్లు మునీంద్ర ఈ విషయాన్ని ప్రస్తావించినా.. ఫలితం లేకపోవడంతో.. ఆదోని కోర్టును ఆశ్రయించారు. పూర్వాపరాలు విచారించిన కోర్టు.. మునీంద్రకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 12 ఏళ్లపాటు కౌలు కూడా చెల్లించకపోవడంతో.. అగ్రిమెంట్ సమయంలో ఇచ్చిన లక్ష రూపాయలను కౌలు కింద జమ చేసుకునేలా గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించింది.
కోర్టు ఆదేశాల మేరకు పొలాన్ని స్వాధీనం చేసుకునేందుకు మునీంద్ర వెళ్లగా.. మల్లికార్జున కుటుంబం అతనిపై దౌర్జన్యం చేసింది. మునీంద్ర స్థానిక కౌతాళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మల్లికార్జున కుటుంబంపై కేసు నమోదైంది. మల్లికార్జున సోదరులకు గతంలో నేర చరిత్ర ఉంది. ఆదోని సమీపంలోని నానాపురం మల్లికార్జున సోదరుల స్వగ్రామం. 1998లో సొంత బాబాయ్‌ని హత్య చేసిన కేసులో ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ హత్య తర్వాత వారు నానాపురం వదలి.. వారి తల్లి స్వగ్రామమైన కామవరం వచ్చారు.
కోర్టు ఆదేశాలు ఇచ్చినా మునీంద్రకు పొలం దక్కలేదు. తన పొలం సమస్యను మునీంద్ర కౌతాళం మండల వైసీపీ నాయకుడు మహేంద్రరెడ్డికి చెప్పి పరిష్కరించాలని కోరాడు. బీజేపీలో ఉన్న మల్లికార్జునకు ఎమ్మిగనూరు బీజేపీ నేత పురుషోత్తం రెడ్డి మద్ధతుగా ఉన్నారు. ఈ నేపథ్యం వల్ల మహేంద్రరెడ్డి.. మల్లికార్జునతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మహేంద్రరెడ్డి జోక్యం చేసుకోవడంతో మల్లికార్జున ఈ విషయంపై లోకల్ పత్రికల్లో మహేంద్రరెడ్డికి వ్యతిరేకంగా కథనాలు రాయించారు. అసలు సంబంధంలేని విషయంలో తమ పార్టీ నేత మహేంద్రరెడ్డికి చెడ్డపేరు తీసుకువచ్చేలా మల్లికార్జున ప్రవర్తిస్తున్నాడనే భావనలో స్థానిక వైసీపీ నేత, సర్పంచ్ వసంత అన్న శివప్ప, ఈరప్పలు ఉన్నారు. ఈ విషయమై అడిగేందుకు శివప్ప, ఈరన్న సహా దాదాపు 50 మంది మల్లికార్జున ఇంటికి వెళ్లారు. శివప్ప, ఈరన్నలు తమపై దాడి చేస్తారనే అనుమానంతో ఉన్న మల్లికార్జున కుటుంబం ప్రతి దాడి చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంది.
ఈ రోజు ఉదయం శివప్ప తన వారితో కలిసి మల్లికార్జున ఇంటి వద్దకు వెళ్లగా.. ఇరు వర్గాల మధ్య వాదులాట చోటు చేసుకుంది. ముందుగానే దాడికి సిద్ధంగా ఉన్న మల్లికార్జున కుటుంబం.. ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడింది. పిల్లలు ఇంటిపై నుంచి రాళ్లు రువ్వగా.. మహిళలు కారం చల్లారు. పొలాలకు పురుగుమందులు కొట్టే స్ప్రేయర్‌లో ముందుగానే పెట్రోల్ నింపుకుని ఉన్న మల్లికార్జున సోదరులు.. దాని ద్వారా శివప్ప, ఈరన్న, ఇతరులపై పెట్రోల్ స్ప్రే చేశారు. ఆ వెంటనే మహిళలు కారం చల్లారు. కర్రలతో దాడి చేశారు. పెట్రోల్ మీద పడడంతో అందరూ పరుగులు తీశారు. వారిని వెంటాడిన మల్లికార్జున సోదరులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దాడిలో కిందపడిన శివప్పకు నిప్పు అంటించారు. అతను అక్కడికక్కడే చనిపోయాడు. రక్తగాయాలు అయిన ఈరప్పను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.