iDreamPost
android-app
ios-app

మరో దాణా కేసులో లాలూ

  • Published Feb 15, 2022 | 11:11 AM Updated Updated Feb 15, 2022 | 11:11 AM
మరో దాణా కేసులో లాలూ

రెండున్నర దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు దాణా కుంభకోణానికి సంబంధించి ఐదో కేసులోనూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించింది. దూరండో ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులు డ్రా చేసిన కేసులో రాంచీ సీబీఐ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. లాలూను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి సీకే షాహీ ఈ నెల 21న శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో దాణా కుంభకోణానికి సంబంధించి తనపై నమోదైన ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా తేలింది.

రూ.950 కోట్ల కుంభకోణం

బీహార్ పశుసంవర్ధక శాఖ పరిధిలో పశువులకు దాణా, మందులు తదితరాలు కొనుగోలు పేరుతో 1991 నుంచి 1996 మధ్య కాంగ్రెస్, జనతాదళ్ ప్రభుత్వాల హయాంలో రూ.950 కోట్ల నిధులు దారిమళ్ళాయి. అప్పటి రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ట్రెజరీల నుంచి విచ్చలవిడిగా నిధులు డ్రా చేసి దారి మళ్లించేశారు. 1996లో ఈ కుంభకోణం వెలుగు చూసింది. కలకలం రేపిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించి.. విచారణకు రాంచీలో సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఈ కుంభకోణంలో కుట్రదారులుగా పేర్కొంటూ అప్పటి సీఎం, ప్రస్తుత ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తోపాటు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను నిందితులుగా చేర్చారు. విచారణలో జగన్నాథ్ మిశ్రా నిర్దోషిగా తేలింది. లాలూ మాత్రం ఐదు కేసుల్లో దోషిగా తేలారు. 

అన్ని కేసుల్లోనూ శిక్షలు, బెయిల్

దాణా కుంభకోణానికి సంబంధించి సుమారు 50 కేసులు నమోదు కాగా.. ఐదు కేసుల్లో లాలూ యాదవ్ ఉన్నారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో ఆయనకు శిక్షలు పడ్డాయి.

– చాయ్ బాసా ట్రెజరీ నుంచి రూ.37.7 కోట్లు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఐదేళ్ల శిక్ష పడింది.

-దేవఘర్ ట్రెజరీ నుంచి రూ. 84.53 కోట్లు డ్రా చేసిన కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించారు.

-చాయ్ బాసా ట్రెజరీ నుంచే మరో రూ. 33.67 కోట్లు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

-దుమ్కా ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లు డ్రా చేసిన నాలుగో కేసులో రెండు సెక్షన్ల కింద చెరో ఏడేళ్ల శిక్ష విధించారు.

-ఐదోదైన దూరండో ట్రెజరీ నుంచి రూ. 139.35 కోట్ల మళ్లింపు కేసులో గత నెల 29న డిఫెన్స్ వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేసి.. ఈ రోజు వెలువరించారు.

ఇప్పటికే శిక్షలు పడిన అన్ని కేసులను ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేసిన లాలూ యాదవ్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. జుడీషియల్ కస్టడీ పేరుతో సుమారు మూడున్నరేళ్లు జైలులో ఉన్న ఆయన తాజా కేసులో శిక్ష పడితే మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే దీనిపైనా ఆయన స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.

Also Read : డియ‌ర్ కేసీఆర్ గారూ.. ఇదిగో సాక్ష్యం : అస్సాం సీఎం కౌంట‌ర్