Idream media
Idream media
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ భేటీ లో ఉన్నారు. దిగ్గజ నాయకులు ఇద్దరు కలవడం మామూలుగానే ఆసక్తి రేకెత్తిస్తుంది. లాలూ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారనే చర్చను రేపింది. రాష్ట్రీయ జనతాదళ్ ఏర్పాటు చేసి 25 ఏళ్లయిన సందర్భంగా నాడు లాలూ చెప్పిన మాటలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. ఇది అందుకు కొనసాగింపేనా అన్న భావన రాకమానదు. త్వరలోనే నేను, నా పార్టీ ఆట మొదలుపెడతామని, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, బిహార్‌లో నితీశ్‌కుమార్ పాలన అనేక అంశాల్లో వైఫల్యం చెందాయని విమర్శించారు. సరిగ్గా నెల కూడా తిరగకముందే.. ములాయం సింగ్ యాదవ్ తో లాలూ భేటీ కావడం ఆలోచించాల్సిందే.
ఇప్పటికే దేశంలో పార్టీల కొత్త పొత్తులపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. విపక్ష పార్టీల అందరి లక్ష్యం బీజేపీని దించడమే అన్నట్లుగా కనిపిస్తోంది. ఆ దిశగా రాజకీయాలు మెల్లమెల్లగా వేడెక్కుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో హీట్ పుట్టించేందుకు పలువురు రాజకీయ పార్టీల నేతలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద ఒంటరి పోరాటం చేస్తూనే జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలో దేశంలో సీనియర్ పొలిటికల్ లీడర్లలో ఒకరు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా యాక్టివ్ అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ గతంలో కూడా రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ మోర్చాను ఏర్పాటు చేశాయి.తమ మధ్య స్నేహాన్ని బలపర్చుకోవటం కోసం ములాయం మనవాడికి లాలూ కూతురిని ఇచ్చి పెళ్లి కూడా చేశారు. కానీ 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అంశం మీద వచ్చిన బేధాభిప్రాయాలతో లోక్‌తంత్రిక్ మోర్చా అస్తిత్వాన్ని కోల్పోయింది. అయితే ఇప్పుడు యాదవ జోడి ఇప్పుడు కొత్త ఫ్రంట్ ఏర్పాటు వైపు అడుగులు వేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల విషయం పక్కన పెడితే.. అందుకు ముందుగా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనేందుకే సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో లాలూ సమాలోచనలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ములాయంతో లాలూ ప్రసాద్ భేటీ కావడంతో జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టీ, ఆర్జేడీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే దిశగా పలు నిర్ణయాలు జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్యలపై పోరాటం ఉధృతం చేసే దిశగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా భేటీ సందర్భంగా లాలూ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అసమానత, నిర్లక్షరాస్యత, వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సమస్యలు, పేదరికం, నిరుద్యోగం తదితర అంశాలపై ములాయంతో చర్చించినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది సోషలిజం తప్ప.. క్యాప్టలిజం, కమ్యూనలిజం కాదని అందులో పేర్కొనడం ద్వారా వారి పోరాటం చెప్పకనే చెప్పారు.
యూపీ అసెంబ్లీకి ఎన్నికల్లో అధికార బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అఖిలేష్ యాదవ్ కూడా గతంలోనే ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఆప్ నేతలతో అఖిలేష్ చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు సమాజ్‌వాది పార్టీ-ఆర్జేడీల మధ్య పొత్తు ఉండే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది. రాజకీయ దిగ్గజాలు లాలూ, ములాయం చేతులు కలిపి యూపీ ఎన్నికల్లో పనిచేస్తే బీజేపీకి చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.