శ్రీవారికి భారీ విరాళం అందజేసిన భక్తుడు

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువైన ఈ దేవాలయాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఇల వేల్పుగా పేరుగాంచిన శ్రీవారికి ముడుపులు, మొక్కులు, విరాళాలను అందిస్తుంటారు భక్తులు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులతో, ఓం నమో వెంకటేశాయ నామస్మరణతో నిత్యం తిరుమల గిరులు మారుమోగిపోతూ ఉంటాయి. కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడు తమ కష్టాలను కడతేరుస్తాడని విశ్వసిస్తుంటారు. ఏడు కొండల వాడిని దర్శించుకుని తన్మయత్వంతో మురిసిపోతుంటారు భక్తులు. ఇటీవల కాలంలో దేశ విదేశాల నుండి భక్తులు వస్తున్నారు. సెలబ్రిటీల తాకిడి కూడా ఎక్కువ అయ్యింది. అంబానీ కుటుంబ సభ్యులే కాకుండా తాజాగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా సందర్శించిన సంగతి విదితమే.

వెంకటేశ్వరునికి భక్తులు విరాళాల రూపంలో కానుకలు అందజేస్తారు. అత్యధిక సంపద కలిగిన దేవాలయాల్లో తిరుమల నిలుస్తూ ఉంటుంది. తమ కోర్కెలు తీర్చినందుకు భక్తులు ఆయనకు బంగారు, వెండి ఆభరణాలకు విరాళంగా సమర్పిస్తుంటారు. తాజాగా డాక్టర్‌ రాజారెడ్డి అనే భక్తుడు భారీ విరాళం అందించాడు. ఆయన వెంట ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ అధినేత కూడా ఉన్నారు. ఆయన ఎవ్వరో కాదూ.. ’డబ్బులు ఊరికనే రావు‘అంటూ మనల్నో స్ఫూర్తినింపే లలితా జ్యువెల్లరీ ఎండి కిరణ్ కుమార్. బుధవారం శ్రీవారిని సందర్శించుకున్న వీరు .. అష్ట దళ పాద పద్మరాధన సేవకు ఉపయోగించే 108 బంగారు పుష్పాలను టీటీడీకి అందజేశారు. స్వర్ణ పుష్పాల కోసం సుమారు రెండు కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. బంగారు పూలను ఆయన మీడియాకు చూపించారు.  అనంతరం ఆయన్ను శ్రీవారిని దర్శించుకున్నారు. కిరణ్ కుమార్ , రాజారెడ్డిలను వేద పండితులు ఆశీర్వదించారు.

Show comments