Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ లో ఆదివారం చేపట్టిన రైతుల ఆందోళన లో చెలరేగిన కార్ చిచ్చు తో లఖీంపూర్‌లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఓ వైపు యోగి సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా.. మరోవైపు కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను అరెస్టు చేయాలంటూ రైతు సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతుల మరణాలపై జాతీయ మీడియా మొత్తం కేంద్ర ప్రభుత్వంపై ఫోకస్ పెట్టింది. ఈ మరణాలు కేంద్రం చేసిన హత్యలుగా కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో రైతు పోరాటం మరో మలుపు తిరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. రైతులకు మద్దతు పెరుగుతూ వస్తోంది.
దేశ వ్యాప్తంగా నిరసనలు
రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో యూపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చల్లారకడం లేదు. ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బారికేడ్లు, వాహనాలను అడ్డుగా పెట్టి భారీగా బలగాలను మోహరించారు. లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. లఖీంపూర్ ఘటనతో ఢిల్లీలోనూ ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీపూర్ సరిహద్దులను మూసివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒక్క యూపీతోనే ఆందోళనలు ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా విపక్ష సభ్యులు నిరసనలకు పిలుపు ఇచ్చారు.
Also Read : చిన్న దేశాల్లో పెద్దల రహస్య ఆస్తులు- పండోరా పేపర్స్ ఏం చెబుతున్నాయి..?
కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణమేర్పడింది. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా అఖిలేష్‌ను ఇంటివద్దే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ టెన్షన్ టెన్షన్ నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా పెద్ద సంఖ్యలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. మరోవైపు కేంద్రమంత్రి రాజీనామా చేయాలని .. మృతుల కుటుంబాలకు 2కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు అఖిలేష్ యాదవ్.
మరోవైపు లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపారన్న ఆరోపణలపై కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రా సహా 14మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. లఖీంపూర్‌ఖేరీలో రైతులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా ప్రియాంక పోలీస్ స్టేషన్ లో చీపురు పట్టారు. తన గదిని తానే శుభ్రం చేసుకున్నారు. అయితే తాను బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాత్రమే వెళ్తున్నానని..ఇదేమీ నేరం కాదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రియాంక. ఆమెకు భరోసాగా రాహుల్‌గాంధీ ఓ ట్వీట్ పెట్టారు. నీ ధైర్యం ముందు వాళ్లంతా వెనక్కి తగ్గారు. పోరాడుతున్న రైతులను మనం గెలిపిద్దామంటూ ట్వీట్ చేశారు.
Also Read : రైతుల పై దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు , 8 మంది మృతి
రూ.45 లక్షల ఎక్స్ గ్రేషియా
రైతుల మరణాలతో ఉత్తరప్రదేశ్ లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి యోగి అన్ని కోణాల్లోనూ ప్రయత్నిస్తోంది. ఒక వైపు ఆందోళనలను అడ్డుకుంటూనే.. మరోవైపు రైతులతో చర్చలు జరుపుతోంది. ఈ ఘటనపై రైతు సంఘాలతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. యోగి సర్కార్ చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. అయినప్పటికీ ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతుల సంఘాలు పేర్కొంటున్నాయి.