Idream media
Idream media
రైతు ఉద్యమం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది. ఈ ఉద్యమంలో రెండు అంశాలు బాగా కలకలం రేపాయి. ఒకటి రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్ల ర్యాలీ, మరొకటి లఖింపూర్ ఘటన. ఈ రెండు ఘటనల్లోనూ హింస చెలరేగింది. ఇక లఖింపూర్ ఘటన అయితే మోడీ సర్కారుకు తీరని మచ్చగా మారింది. అలాగే.. ఇప్పటి వరకూ మరే కేంద్ర మంత్రి మీదా రాని రీతిలో వచ్చిన దారుణ ఆరోపణలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా మీద వచ్చాయి. అక్టోబరు మూడున లఖింపూర్ ఖేరీలో రైతుల మీద నుంచి వాహనాల్ని దూసుకెళ్లేలా చేసిన ఉదంతంలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
దీని వెనుక కేంద్రమంత్రి కుమారుడి హస్తం ఉందన్న ఆరోపణలు రావడం, విచారణ జరుగుతుండడం, విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. నేరారోపణలు వచ్చిన వెంటనే.. సదరు నేతను ఇంటికి పంపించటం చూస్తాం. కానీ.. అందుకు భిన్నంగా ప్రధాని మోడీ మాత్రం ఆ కేంద్ర మంత్రిని అదే పదవిలో కొనసాగించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను ఇప్పుడు కొందరు బ్లాక్ మొయిల్ చేశారట. తమ వద్ద లఖింపూర్ ఉదంతానికి సంబంధించిన వీడియోలు.. సాక్ష్యాలు ఉన్నాయని.. తాము డిమాండ్ చేసిన రూ.2.5 కోట్లు ఇస్తే వాటిని ఇచ్చేస్తామని చెప్పారట.
ఈ ఉదంతంపై కేంద్రసహాయమంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే.. బెదిరింపులకు పాల్పడిన పలువురిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి నొయిడాలో నలుగురిని.. ఢిల్లీలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్ ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా చేసినట్లు గుర్తించారు. మొత్తానికి అమాయక రైతుల ఉసురు తీసిన ముదురు మంత్రిని బ్లాక్ మొయిల్ చేయబోయి భంగపడటమే కాదు.. జైలు ఊచలు లెక్కిస్తున్నారు.