Idream media
Idream media
తెలంగాణ టీడీపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి ఉన్న ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు ఇతర పార్టీల్లో చేరగా.. ముఖపరిచయం ఉన్న మిగిలిన నేతల్లో ఎల్ రమణ తాజాగా ఆ పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రమణ.. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపారు. పార్టీ వీడుతున్న కారణాన్ని రమణ క్లుప్తంగా ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో మారిన మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నాను. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నా ఎదుగుదలకు తోడ్పాటునందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ ఎల్ రమణ చంద్రబాబును ఉద్దేశించి రాశారు.
కొన్ని రోజులుగా రమణ టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు పలు దఫాలు అంతర్గతంగా చర్చలు సాగాయి. టీఆర్‌ఎస్‌లో తన ప్రాత ఏమిటనే అంశంపై క్లారిటీ వచ్చిన తర్వాత రమణ.. గురువారం మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుతో కలసి వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. మరుసటి రోజే టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రమణ ప్రకటించారు.
టీఆర్‌ఎస్‌లో ముఖ్యనేతగా, రాష్ట్ర స్థాయిలో బీసీ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ఇటీవల టీఆర్‌ఎస్‌ను వీడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌లో ఉప ఎన్నికల అనివార్యమైంది. రాజేందర్ వెళ్లిపోవడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, హుజురాబాద్‌లో పార్టీ తరఫున బలమైన బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఎల్.రమణను పార్టీలోకి చేర్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా రమణతో చర్చలు జరిపారు. పార్టీలో చేర్చుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫున రమణ పోటీ చేస్తారనే ప్రకటన రావడం ఇక లాంఛనమే.
Also Read : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్.రమణ..?