iDreamPost
iDreamPost
తెలుగుదేశం నేత కురుపాం మాజీ ఎమ్మేల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం పాలవ్వడంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు స్వయానా మేనల్లుడు అయిన జనార్థన్ థాట్రాజ్ ఆయన వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసి. 2009లో కాంగ్రెస్ తరపున కురుపాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో మేనమామ విజయరామరాజుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున బరిలోకి దిగి ప్రత్యర్ధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్పశ్రీవాణి చేతిలో ఓటమిపాలయ్యారు.
ఇక 2019 ఎన్నికల బరిలో దిగిన ఆయన కుల దృవీకరణ పత్రానికి సంభందించి తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. అయితే ముందుజాగ్రత్తగా జనార్ధన్ తల్లిగారైన నరసింహ ప్రియా థాట్రాజ్తో నామినేషన్ వేయించడంతో చివరికి ఆమే తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీలో నిలిచి వైయస్సార్ అభ్యర్ధి పుష్పశ్రీవాణి చేతిలో ఓటమిచవిచూశారు. శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు చంద్రశేఖర రాజు కుమారుడు శత్రుచర్ల పరిక్షిత్ భార్యే డిప్యుటి సీయం పుష్పశ్రీ వాణి. శత్రుచర్ల చంద్రశేఖర రాజు 1989లో “నాగురు” నుండి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కుటుంభసభ్యుల మధ్య జరిగిన ఎన్నికల పోరులో రెండు సార్లు పుష్పశ్రీవాణే గెలుపోందారు.
43 ఏళ్ళకే జనార్ధన్ అకాల మరణం చెందడంతో ఆయన అబిమానులు , తెలుగుదేశం శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు , ఆయన తనయుడు లోకేష్ ట్వీట్ చేస్తూ సంతాపం తెలిపారు.