iDreamPost
iDreamPost
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్బాటాలకు కర్నూలు వాసులు బలయ్యారు. అభివృద్ధి జరిగి బాగుపడతామని ఎన్నో కలలు కన్న ప్రజలకు కష్టాలే మిగలాయి.
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు చెప్పారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు గంటల్లోపే చేరుకోవచ్చు. ఇలా అంచనాలు వేసుకొని ఇక్కడ ఎయిర్ పోర్టు తీసుకొస్తే కనెక్టివిటీ బాగుంటుందని ఆలోచన చేశారు. నంద్యాల హైవేలో 2017 జూన్‌లో చంద్రబాబు శంకుస్థాపన చేసి ఏడాదిలోపు పూర్తి చేసి తీరుతామని ప్రగల్బాలు పలికారు.
640 ఎకరాల్లో చేపట్టిన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానిని రూ. 90.5 కోట్లతో పూర్తి చేయొచ్చని అంచనాలు వేశారు. ఈ అంచనాలు కాస్త పెరిగి వంద కోట్ల రూపాయలు దాటి ఖర్చయ్యింది. అయితే ఇంత ఖర్చయినా ఏయిర్ పోర్టు నిర్మాణం పూర్తికాలేదు. ఇప్పటికీ ఇంకా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే ఏడాదిలో పూర్తి చేస్తామని శంకుస్థాపన కార్యక్రమంలో చెప్పిన చంద్రబాబు ఏడాదిన్నర సమయం తీసుకొని అరకొరగా పనులు చేయించారు. అయితే 2019 ఎన్నికలు సమీపిస్తాయన్న నేపథ్యంలో 2018 డిసెంబర్‌లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత 2019 జనవరి 8వ తేదీన ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌ను చంద్రబాబు హడావిడిగా ప్రారంభించారు.
చంద్రబాబు ప్రారంభించి ఇప్పటికీ సంవత్సరం పూర్తవుతున్నా ఇంతవరకు ఎయిర్‌పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఏటీసీ టవర్ పనులతో పాటు టెర్మినల్ భవనంలోని అంతర్గత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఎయిర్‌పోర్టు వస్తే తమకు ఏదో విధంగా ఉద్యోగ, ఉపాది అవకాశాలు వస్తాయనుకున్న జిల్లా వాసులు నిరాశలో పడిపోయారు. చంద్రబాబును నమ్ముకొని రెండేళ్లుగా ఎదురుచూసినా ఫలితం దక్కలేదని ఆవేధన చెందుతున్నారు. ఇప్పుడు వై.ఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమలోని ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులతో పాటు, కొత్తగా హైకోర్టును కర్నూల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ఎయిర్‌పోర్ట్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి ఉన్నతాధికారులు ఎయిర్‌పోర్టును సందర్శించేందుకు వస్తున్నారు. దీంతో ఇప్పటి ప్రభుత్వం చొరవతోనైనా విమానాశ్రయ పనులు పూర్తవుతాయేమోనని జిల్లా వాసులు నమ్మకంతో ఉన్నారు.