Idream media
Idream media
మద్రాసీలుగా పిలిపించుకుంటూ… మద్రాస్ రాష్ట్రంలో భాగమైన తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ భారీ ఉద్యమమే జరిగింది. పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953 అక్టోబరు 1వ తేదీన… మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పుడు… కర్నూలు మన రాజధాని.
నూతనంగా ఏర్పాటైన రాష్ట్రంలో కనీస వసతులు కూడా లేవు. రాజధాని కర్నూలులో మంత్రులు, అధికారులు విధులు నిర్వర్తించేందుకు భవనాలు కూడా లేవు. చెట్ల కింద గుడారాలు వేసుకొని, అక్కడి నుంచే రాష్ట్ర పాలనసాగింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేసింది. కర్నూలులో అన్ని కార్యాలయాల భవనాల నిర్మాణం చేపట్టింది. రోడ్లు, విద్యుత్, రవాణా మార్గాలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగింది.
సదుపాయాల కల్పనలో భాగంగా కర్నూలులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా విమానాశ్రయం నిర్మించాలని అప్పటి అధికారులు ప్రతిపాదిందరు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన అనుమతులనిచ్చింది.
అప్పట్లో రూ.13 లక్షలే..!
నూతన రాష్ట్రం.. నూతన రాజధాని… అందులో నూతనంగా నిర్మించనున్న విమానాశ్రయం. విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే కర్నూలుకు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరిగి, రాకపోకలు వేగంగా సాగేవి. అలాగే వేగంగా అభివృద్ధి అయ్యేందుకు వీలుండేది.
విమానాశ్రయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. నిర్మాణానికి రూ. 13 లక్షలు అవుతుందని అంచనా వేశారు. అప్పటికి కర్నూలు తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉండడంతో విమానాలు వెళ్లేందుకు, దిగేందుకు ఎయిర్ స్ట్రిప్ లు మొదటగా నిర్మిస్తామని అప్పటి ఆర్థిక మంత్రి విశ్వనాథ్ వెల్లడించారు. తరువాత విమానాశ్రయాన్ని విస్తరించుకుంటూ వెళతామని కూడా చెప్పారు.
అయితే అనేక పరిణామాల అనంతరం 1956 లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. అప్పటికే అన్ని హంగులతో ఉన్న హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు మన పాలకులు ఉవ్విళ్లూరారు.
అప్పటివరకు ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా ఉన్న కర్నూలును పట్టించుకోవడమే మానేశారు. వివిధ అభివృద్ధి పనులతో పాటు విమానాశ్రయ నిర్మాణ పనులు అటకెక్కాయి. హైదరాబాద్ పై పెట్టిన శ్రద్ధలో పదో వంతు కర్నూలుపై పెట్టిఉంటే మహా నగరాల సరసన కర్నూలు నిలిచేది.
1953లోనే విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి. రూ. 13 లక్షలతో నిర్మాణం పూర్తి చేసి ఉంటే … ఈ ఏడు దశాబ్దాల కాలంలో కర్నూలు విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు ప్రఖ్యాతులు గడించేది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతర్జాతీయ ప్రయాణం చేయాలంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లాల్సిందే. ఏడు దశాబ్దాల కల ఇప్పటికి సాకారమై కర్నూలు విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో… రానున్న రోజుల్లో విమానాశ్రయం మరింత అభివృద్ధి చెంది అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి ఎదగాలని ప్రజలు కాంక్షిస్తున్నారు.
రాయలసీమ జిల్లాల్లో కర్నూలుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. టెంపుల్ డిస్ట్రిక్ట్ గా ప్రఖ్యాతి చెందింది. అలాగే ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై నగరాలు దగ్గరే. అప్పట్లో మన పాలకులు కొంచెం ముందు చూపు ఉండి పనిచేసి ఉంటే ఈ పాటికి కర్నూలు మహా నగరంగా అభివృద్ధి చెంది వుండేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
గత పాలకులు చేసిన తప్పులను సీఎం జగన్ మోహన్ రెడ్డి పునరావృతం చేయకపోవడం ఆహ్వానించదగ్గ విషయం. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే భవిష్యత్ లోనూ నూతన రాష్ట్రాల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కర్నూలుని శాసన రాజధానిని చేయడంతో ఇప్పటి నుంచైనా కర్నూలు జిల్లా శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం.