iDreamPost
iDreamPost
కుప్పం మునిసిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. అందువల్ల ఈ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకంగానే ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 15న పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల కౌంటింగ్ రెండో రోజు అంటే నవంబర్ 17న జరుగుతుంది. అయితే 12 మున్సిపాలిటీల కంటే ప్రజల దృష్టి అంతా ఇప్పుడు కుప్పం పైనే ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు చంద్రబాబు నాయుడు ఓ రెండు రోజులపాటు కుప్పంలో పర్యటించారు. ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పర్యటనలో ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందంతో సర్వే చేయించారు. పనిలో పనిగా తన పార్టీ కార్యకర్తలను ఉత్తేజపర్చే ప్రసంగాలు చేశారు. ఈ పర్యటన సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగం ఆయన రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టింది.
ఇన్నేళ్ళుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నా కుప్పం ని మున్సిపాలిటీ చేయకపోవడాన్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపని చేయడాన్ని చంద్రబాబు వక్రీకరించారు. మున్సిపాలిటీగా చేస్తే ప్రజలపై పన్నుల భారం పడుతుందని కుప్పంని మున్సిపాలిటీగా తాను ప్రకటించలేదని చంద్రబాబు ప్రకటించి పెద్ద తప్పిదమే చేశారు. ఆయన హయాంలో మున్సిపాలిటీలుగా చేసిన ప్రాంతాలపై పన్నుల భారం మోపినట్టు ఈ ప్రకటన ద్వారా ఆయన అంగీకరించారు. ఇలాంటి ప్రకటనలు ఆయన అనుభవానికి తగ్గట్టుగా కాక, కేవలం ఓటర్లను ప్రభావితం చేసేవిగానే ఉన్నాయి. అయితే చంద్రబాబు చేసిన ఈ ప్రకటన పట్ల ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
అలాగే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వరుస పరాజయాలు చవిచూస్తున్న టీడీపీకి కుప్పం ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. తమ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఓటమి రాజకీయంగా కీలకమే. ఇక్కడ కూడా పార్టీ ఓడిపోతే 2024 వరకూ అంటే మరో రెండు సంవత్సరాలు పార్టీ శ్రేణులను ఉత్సాహంగా ఉంచడం సాధ్యం కాదు. ఇప్పటికే పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గ్రామ పంచాయితీల ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లోనూ ఎన్నడూ లేనంత పరాభవం చవిచూసింది. వరుసగా జరిగిన ఈ ఎన్నికలు పార్టీ శ్రేణులను నిరుత్సాహ పర్చాయి. ఇప్పుడు కుప్పంలో కూడా పార్టీ ఓడిపోతే ఇక కోలుకోవడం కష్టమే. అందుకే చంద్రబాబు కూడా కుప్పం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు.
ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కుప్పం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. వరుస విజయాలతో రాజకీయంగా ముందున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల నుండి ఇప్పటివరకూ టీడీపీలోని కీలక నేతల నియోజకవర్గాలపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుతో సహా టీడీపీలోని కీలక నేతల నియోజకవర్గాలపై ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్ళింది. కుప్పంలో కూడా చంద్రబాబు మొదటిసారి మూడు రౌండ్ల వరకూ వెనకబడి అతి కష్టం మీద గెలిచారు. ఈ సారి కుప్పం నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో కూడా టీడీపీ ఓటమే లక్ష్యంగా అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. కుప్పంలో టీడీపీ ఓటమి ద్వారా ఆ పార్టీకి రాజకీయ సమాధి కట్టాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది.
అయితే ఏ పార్టీ వ్యూహం ఫలిస్తుందో, టీడీపీ కుప్పంలో గెలిచి 2024 ఎన్నికలకు సిద్ధం అవుతుందా లేక ఇక్కడ కూడా ఓటమి చెంది కుదేలవుతుందా అనే దానికోసం రాష్ట్ర ప్రజలు అతృతతో ఎదురు చూస్తున్నారు.