iDreamPost
android-app
ios-app

సుప్రీంకోర్ట్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కుమారస్వామి

సుప్రీంకోర్ట్  తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కుమారస్వామి

పార్టీ విప్ ని ధిక్కరించి అనర్హత వేటుకి గురైన, ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు పట్ల  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అసంతృప్తితో వ్యక్తం చేసారు. విశ్వాస పరీక్షలో  తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేలను 2023 వరకూ పోటీ చేయకుండా అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు అయింది. అనర్హత  వేటు విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే,  ఆ 17 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఉప ఎన్నికలో పోటీ చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 

ఈ తీర్పు విషయమై కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు పట్ల  అసంతృప్తిగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి, రాజ్యాంగ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని భ్రష్టు పట్టిస్తున్నారని వాపోయారు. బీజేపీ కి మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు వేరే పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? దేశంలో ఉన్న ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో ఆటలాడుతున్నాయని తెలిపారు. నా పార్టీని బలోపేతం చేయడంపైనే ద్రుష్టి పెడతానని స్పష్టం చేసారు. 

జులై 23, 2019న జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతుగా 99 ఓట్లు రాగా బీజేపీకి 105 ఓట్లు వచ్చాయి. మద్దతు కూడగట్టుకోలేక పోవడంతో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది