iDreamPost
iDreamPost
ఇటీవలి కాలంలో కంటెంట్ విషయంలో విమర్శలను ఎగురుకుంటూ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఆహా నుంచి వచ్చిన కొత్త వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. సమంతతో యుటర్న్ తీసి మంచి ప్రశంసలు అందుకున్న దర్శకుడు పవన్ కుమార్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో బడ్జెట్ కూడా బాగానే ఖర్చు పెట్టారు. డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న అమల పాల్ ని చాలా రోజుల తర్వాత స్ట్రెయిట్ తెలుగులో చూడటం దీంతోనే. ఒక్కొక్కటి ఇరవై నుంచి ముప్పై ఐదు నిమిషాల లోపు నిడివితో మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిలర్ కాన్సెప్ట్ తో వచ్చింది. మరి ఇది అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా రిపోర్ట్ లో చూద్దాం.
సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పొట్టకూటి కోసం ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా పని చేసే ఆది(రాహుల్ విజయ్), నగరంలో చిన్న పిల్లల కిడ్నాపుల కేసును చేధించేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ ఆఫీసర్ దుర్గా గౌడ్(అమలా పాల్)లు పరస్పరం ఒక యాక్సిడెంట్ లో తారసపడతారు. ఆ తర్వాత ఇద్దరూ టైం లూప్ లోకి వెళ్ళిపోయి గడిచిన రోజులను మళ్ళీ మొదలుపెట్టుకుంటూ వస్తారు. ఊహించని ఈ పరిణామాల వల్ల చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతాయి. అసలు ఆది, దుర్గాలకు కనెక్షన్ ఎలా కుదిరింది, వీళ్ళ జీవితాలు ఎలా ప్రభావితం చెందాయన్నది కాస్త ఓపిగ్గా సిరీస్ మొత్తం చూస్తే క్లారిటీ వస్తుంది.
ఇప్పటిదాకా ఆహాలో వచ్చిన వెబ్ సిరీస్ లు అన్నిటితో పోల్చుకుంటే ఈ కుడి ఎడమైతే చాలా బెటర్ అని చెప్పాలి. మొదటి రెండు చివరి రెండు ఎపిసోడ్లు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో పవన్ కుమార్ ఆకట్టుకుంటాడు. మధ్యలో కొంత ల్యాగ్, రిపీటెడ్ అనిపించే సన్నివేశాలు సామాన్య ప్రేక్షకులకు కొంత కన్ఫ్యుజింగ్ గా అనిపించడం మైనస్. అది మినహాయిస్తే రామ్ విగ్నేష్ రచనలో పవన్ కుమార్ తన పనితనాన్ని బాగానే చూపించాడని చెప్పొచ్చు. రెండో సీజన్ కోసం పవన్ కావాలని కొన్ని లూజ్ ఎండ్స్ ని వదిలేయడం అవసరం లేదనిపిస్తుంది. మొత్తం క్లోజ్ చేసేసి ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. మొత్తానికి కుడి ఎడమైతే డీసెంట్ వాచ్ క్యాటగిరిలో వేయొచ్చు