iDreamPost
android-app
ios-app

విద్యుత్‌ ఉత్పత్తిపై తెలంగాణకు కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు.. వివాదానికి తెరదించేందుకు కేంద్రం చర్యలు

విద్యుత్‌ ఉత్పత్తిపై తెలంగాణకు కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు.. వివాదానికి తెరదించేందుకు కేంద్రం చర్యలు

దాదాపు మూడు వారాలుగా తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల వివాదంపై కృష్ణా నది యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ) తొలిసారి స్పందించింది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి, అది కాస్త సుప్రిం కోర్టుకు చేరిన నేపథ్యంలో.. కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కేఆర్‌ఎంబీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్‌ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ జన్‌కో అధికారికి లేఖ రాసింది.

అదే సమయంలో.. ఆర్‌డీఎస్‌ కుడి కాల్వ పనులు నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనుమతులు తీసుకునే వరకు పనులు చేపట్టరాదని ఏపీ ఇరిగేషన్‌ ఈఎన్‌సీకి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది.

కాగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదానికి తెర దించేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్టుల విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఆయా నదుల పరిధి, ప్రాజెక్టుల నిర్వహణ,నియంత్రణపై గెజిట్‌ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేపు శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు నదులకు సంబంధించి గెజిట్లను జారీ చేయబోతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యంగా కృష్ణా నది జలాల విషయంపైనే ప్రతి సారి వివాదం చెలరేగుతోంది. కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు తమ హక్కులను కాపాడుకునే క్రమంలో వివాదాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇటీవల ప్రధానికి, కేంద్ర జలశక్తి మంత్రికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలు కూడా రాశారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని.. తమకు హక్కుగా రావాల్సిన నీళ్లను ఇవ్వాలని ఏపీ కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. గోదావరి, కృష్ణా నది పరిధి, ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణపై కేంద్రం విడుదల చేయబోయే గెజిట్లపై ఆసక్తి నెలకొంది.

Also Read : సుప్రింకు చేరిన జల వివాదం.. తెలంగాణను తూర్పారబట్టిన..