iDreamPost
iDreamPost
సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినన్ని ప్రయోగాలు ఇంకే ఇండస్ట్రీలోనూ ఏ హీరో చేయలేదన్నది వాస్తవం. కమర్షియల్ హీరోగా వెలుగొందుతున్న రోజుల్లోనే ఎన్నో సంచలనాలకు తెరతీశారు. జానర్ ఏదైనా తనదైన మార్కు యాక్టింగ్ తో వసూళ్ల వర్షం కురిపించడం కృష్ణ గారికి వెన్నుతో పెట్టిన విద్య. 1983లో ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలకు వెళ్ళిపోయాక ఆ టైంలో కృష్ణ ఇంకాస్త స్పీడ్ తో దూసుకుపోవడం మొదలైంది. అదే సమయంలో చిరంజీవి రూపంతో ఖైదీతో ఓ కొత్త మాస్ స్టార్ ప్రస్థానం కూడా శ్రీకారం చుట్టుకుంది. ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజులు అప్పటికే కొంత తగ్గారు. అయినా కృష్ణ గారి హవా మాత్రం అలాగే కొనసాగింది.
1985లో వచ్చిన అగ్ని పర్వతం దీనికి మంచి ఉదాహరణ. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారితో అశ్వినిదత్ భారీగా నిర్మించిన ఈ మూవీలో కృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. రెండో పాత్ర చంద్రం నామ్ కే వాస్తే అయ్యింది కానీ మాఫియా డాన్ జమదగ్ని పాత్రలో మాత్రం కృష్ణ విశ్వరూపం చూపించారు. జీవితంలో దగాపడి అతి దారుణమైన స్థితిలో తల్లి చావుకు కారణమైన వాడి అంతం చూసేందుకు ప్రతినబూని మంచి కోసం దుర్మార్గాలు చేసే పవర్ ఫుల్ పాత్రలో కృష్ణ చెలరేగిపోయారు. ముఖ్యంగా అగ్గిపెట్టె ఉందా అనే డైలాగ్ అప్పట్లో ఎంత పాపులర్ అంటే అదో ఊత పదంలా మారిపోయింది. ఎవరినైనా బెదిరించే ముందు కృష్ణ వాడే మాట అది.
పరుచూరి బ్రదర్స్ సంభాషణలు. చక్రవర్తి సంగీతం, విజయశాంతి- రాధల గ్లామర్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ జత చేశాయి. అధిక శాతం కేంద్రాల్లో వంద రోజులు ఆడటమే కాక 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడటం అప్పట్లో ఒక రికార్డు. అగ్ని పర్వతం తర్వాత కృష్ణ గారు మరింత ఉత్సాహంతో అలాంటి పాత్రలతో పాటు సింహాసనం లాంటి విజువల్ వండర్స్ కూడా తీశారు. ఎన్ని వచ్చినా సూపర్ స్టార్ అభిమానులకు మాత్రం అగ్ని పర్వతం ఒక ఎవర్ గ్రీన్ మెమరీగా నిలిచిపోయింది. మహేష్ బాబుని సైతం ఇలాంటి రోల్ లో చూడాలని ఫ్యాన్స్ కోరిక. నిజంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇలాంటి సబ్జెక్టు ఏ దర్శకుడు చేస్తాడో ఎప్పటికి అది రూపొందుతుందో వేచి చూడాలి. అదే జరిగితే అంతకన్నా పండగ సినిమా ప్రేమికులకు ఏముంటుంది.