iDreamPost
android-app
ios-app

అప్పుడు వస్తుంటే ఆపారు..! ఇప్పుడు పిలిచినా రాలేదు..!!

అప్పుడు వస్తుంటే ఆపారు..! ఇప్పుడు పిలిచినా రాలేదు..!!

ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న కొటియా గ్రామాల సమస్య మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఒడిషాలో జరిగిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొటియా గ్రామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొటియా గ్రామాల ప్రజలు ఒడిషా ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకపోవడం మరోసారి కొటియా గ్రామాలపై చర్చకు దారితీసింది. తాము పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనబోమని కొటియా గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్‌ వాసులమని, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని అధికారులకు స్పష్టం చేయడంతో.. వారిని పోలింగ్‌ బూత్‌లకు రప్పించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. బతిమాలినా ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లలేదు.

విజయనగరం జిల్లా సాలూరు, పాచిపెంట మండలాల్లోని ఒడిషా సరిహద్దు గ్రామాలపై దశాబ్ధాల తరబడి వివాదం నెలకొని ఉంది. ఆయా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనేదే అసలు సమస్య. కొటియా గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్రాలు వివిధ గుర్తింపు కార్డులు మంజూరు చేశాయి. ఆయా గ్రామాలు తమ సరిహద్దులోనివని ఒడిషా, ఏపీలు వాదించుకుంటున్నాయి. గత ఏడాది ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొటియా గ్రామాల ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఒడిషా అధికారులు అడ్డుకున్నా.. ఆగలేదు. దారులు మూసివేసినా, సిబ్బందిని మోహరించినా వారిని తోసుకుంటూ వచ్చి ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తాము ఉంటామని అప్పుడు కొటియా గ్రామాల ప్రజలు ఒడిషా అధికారులకు తేల్చి చెప్పారు.

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ చూపారు. గత ఏడాది ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నదీజలాలు, కొటియా గ్రామాల సరిహద్దు సమస్యలు.. ఇలా పలు అంశాలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని సంయుక్తంగా ఓ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ సాగుతుండగా.. తాజాగా ఒడిషా పంచాయతీ ఎన్నికల రూపంలో సరిహద్దు వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని ఒడిషా అధికారులు అడ్డుకున్నా నాడు ఆగకుండా ఓటు వేసిన కొటియా గ్రామాలు.. తాజాగా ఒడిషా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఓటువేయాలని అధికారులు వచ్చి పిలిచినా వెళ్లకపోవడం గమనార్హం. ఈ సమస్యతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఇతర సమస్యలు ప్రధాన కార్యదర్శుల కమిటీ నేతృత్వంలో త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

Also Read : రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ !