Idream media
Idream media
హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ఇప్పటికే బాగా వెనకబడి ఉంది. టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా రీతిలో తలబడుతుంటే.. కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించ లేదు. అయితే, సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖను పోటీలో దించాలని సీనియర్లు అందరూ సూత్రప్రాయంగా భావించారు. కాంగ్రెస్ నుంచి సురేఖ పోటీ చేస్తుందని ఇప్పటికే అందరూ భావిస్తున్నారు కూడా. కొండా పేరును పీసీసీ సమన్వయ కమిటీ కూడా అధిష్టానికి సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు.
Also Read:హుజూరాబాద్ పై కేసీఆర్ సర్కారు నిర్ణయం కరెక్టేనా?
దరఖాస్తుల గడువు మొన్నటి ఆదివారంతో ముగిసిపోయింది. మొత్తం పద్దెనిమిది దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఇందులో కొండా సురేఖ దరఖాస్తు లేకపోవడంతో పీసీసీ ఖంగు తిందట. కొండా దరఖాస్తు చేయకపోతే వచ్చిన దరఖాస్తుల్లో కూడా 11 నియోజకవర్గానికి చెందిన నేతలవి కాగా మిగిలిన ఎనిమిది బయట నేతలవి. అయితే అందిన దరఖాస్తుల్లో ఒక్కటి కూడా ఉపఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేంత సీనున్న నేతలవి కాదని సమాచారం. కొండా సురేఖ కూడా దరఖాస్తు చేస్తారని పార్టీలోని చాలా మంది నేతలు భావించారు. కానీ ఆశ్చర్యంగా కొండా దరఖాస్తు చేయకపోగా పెద్దగా పోటీ ఇవ్వలేని నేతలు 18 మంది దరఖాస్తు చేయడం తో ఏమి చేయాలో పీసీసీ నేతలకు అర్ధం కావటం లేదు. ఇపుడు పీసీసీ సమస్య ఏమిటంటే దరఖాస్తు చేసిన వాళ్ళల్లో 18 మందినీ కాదనలేరు. అలాగని వాళ్ళల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేయలేరు. ఎందుకంటే వీరిలో ఎవరు కూడా టీఆర్ఎస్ బీజేపీ తరపున పోటీచేయబోయే అభ్యర్థులకు ఏ విధంగాను సరిపోరని తెలుస్తోంది.
దరఖాస్తు చేసిన వాళ్ళని కాదని దరఖాస్తు విషయాన్ని ఏ విధంగాను పట్టించుకోని కొండాకు టికెట్ ఇస్తే అదో పెద్ద సమస్యగా మారిపోతోంది. తమ దగ్గర డబ్బులు గుంజేందుకే దరఖాస్తులు తీసుకున్నారని నేతలు ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఒక్కొక్కరు తలా రు. 5 వేలు కట్టి మరీ దరఖాస్తులు చేశారు కాబట్టి. ఇపుడీ సమస్యలో నుంచి ఎలా బయటపడాలో పీసీసీ నాయకత్వానికి అర్ధం కావటం లేదు. అందుకనే దరఖాస్తు గడువు తేదీని మళ్లీ పొడిగించే అవకాశం ఉందని సమాచారం. దరఖాస్తు గడువును పొడిగిస్తే కొండాను బతిమలాడైనా దరఖాస్తు చేయించే ఆలోచనలో సీనియర్ నేతలున్నట్లు తెలుస్తోంది. అప్పుడు దరఖాస్తు చేసిన వాళ్ళనుండి కొండా సురేఖను ఎంపిక చేసినట్లు బిల్డప్ ఇవ్వాలని పీసీసీ నాయకత్వం ప్లాన్ వేస్తోంది. మరి ఇంతకూ దరఖాస్తు చేయకపోవడంలో కొండా ఆంతర్యం ఏంటో తెలియాల్సి ఉంది.
Also Read:చంద్రబాబుకు ఆ పీఏ తో తలవంపులు తప్పవా?