Idream media
Idream media
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ కు ఎంత కలిసొస్తుందో తెలీదు కానీ, ప్రస్తుతం మాత్రం పార్టీలో తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. రేవంత్ నియామకంపై కొందరు సీనియర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీలో నుంచి వచ్చినవారికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని, దీని వెనుక చాలా తతంగాలు జరిగాయని తాజాగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే అదే తెలంగాణలో ఉనికి కోల్పోతుంది. ఎన్నిక ఏదైనా భంగపాటుకు గురవుతూనే ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం, రాష్ట్రంలో పార్టీ పునర్ వైభవం కోసం అంత కలిసికట్టుగా ప్రయత్నించని సీనియర్లు పదవుల కోసం మాత్రం కొట్లాటకు దిగుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఆ బాధ్యతతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గట్టిగా పోరాడలేని పార్టీ నాయకులు ఇప్పుడు ఇలా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:రేవంత్ కు పీసీసీ – వేడెక్కనున్న తెలంగాణ రాజకీయం
పీసీసీ పదవి కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రకటనకు ముందు రేవంత్ కంటే ముందు నుంచే ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. కానీ ఆయన ప్రయత్నాలు మొదలు కాలేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ ప్రకటన వెలువడిన రోజు సైలెంట్ గా ఉన్న వెంకట్ రెడ్డి తాజాగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్ ఠాకూర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. రేవంత్ పై కూడా పరోక్ష విమర్శలకు పాల్పడ్డారు. పీసీసీ పదవి కార్యకర్తకు ఇస్తారనుకున్నాను కానీ, ఇన్‌చార్జి ఠాకూర్ డబ్బుకు అమ్ముడుబోయి రేవంత్ కు కట్టబెట్టారని అన్నారు. ఓటుకు నోటులా నోటుకు పీసీసీ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జిపైన ఆరోపణలకు పాల్పడ్డారు.
Also Read:భీమిలిపై చినబాబు కన్ను..!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని మొదటి నుంచీ ఓ వర్గం వ్యతిరేకిస్తూనే ఉంది. ఆయనకు ఆ పదవి దక్కకుండా చివరి వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఫైనల్ గా రేవంత్ చీఫ్ అయ్యాక వారిలో కొందరు సైలెన్స్ గా ఉండగా, మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నియామకంపై మేడ్చల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్ననే పార్టీకి రాజీనామా చేశారు. ఓ వైపు రాజీనామాలు దుమారం రేపుతుండగానే.. మరోవైపు కోమటి రెడ్డి వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ శనివారం మాట్లాడుతూ, త్వరలోనే కాంగ్రెస్ సీనియర్లు అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ క్రమంలో తనను కలిసేందుకు ఎవరూ రావొద్దు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం దుమారం రేపుతోంది. ఈ వివాదం ఎంత వరకూ దారి తీస్తుందో, దీనిపై ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుంటారా చూడాలి.