iDreamPost
android-app
ios-app

Kollapur congress – కొల్లాపూర్.. రాజకీయాలు తారుమార్‌..!

Kollapur congress – కొల్లాపూర్..  రాజకీయాలు తారుమార్‌..!

రాజకీయ చైతన్యానికి కొల్లాపూర్ నియోజకవర్గం మారుపేరుగా నిలిచింది. ఇక్కడ పార్టీలు మారడం నాయకులకు నిత్యకృత్యంగా మారింది. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడి ప్రధాన పార్టీలపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న జూపల్లి కృష్ణారావు తదనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.దీంతో క్రితం సారి కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు.ఇప్పుడు ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో పరిస్థితి మొదటికొచ్చింది.

కాంగ్రెస్‌కు అభ్య‌ర్థులు క‌రువు

2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థులు లేకుండా పోయారు. అయితే ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత పార్టీలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. పార్టీ శ్రేణులు క్రియాశీలం అయ్యాయి. ఇదే సందర్భంగా టీఆర్‌ఎస్‌లో ఉన్న చింతలపల్లి జగదీశ్వరరావు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు..నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న జగదీశ్వరరావు ఇక్కడి నుంచి పలుమార్లు పోటీ చేశారు. ఇప్పటికీ ఆయనకు పాత క్యాడర్ మద్దతుగా ఉంది. టీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపు రాకపోవడంతో  కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు

గత ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన రంగినేని అభిలాష్ రావు ఇటీవల రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే కొన్నాళ్ల కిందట కొల్లాపూర్ రాజకీయాల్లో అడుగుపెట్టిన అభిలాష్ రావు కు ఎన్నికల నిర్వహణ పోల్ మేనేజ్మెంట్‌లో కావాల్సినంత అనుభవం ఉంది. యువకుడు కావడం.. మాస్ లీడర్‌గా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భావిస్తుండడం కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే పార్టీ శ్రేణులు మాత్రం నియోజకవర్గంతో అనుబంధం లేని వారికి టికెట్ ఇస్తే ఎలా పనిచేసేదనే మీమాంసలో పడ్డాయి. ఏదేమైనా అసలు నిన్నటి వరకు నేతలు లేని టీ-కాంగ్రెస్‌లో ‌టిక్కెట్ల కోసం ఇంత డిమాండ్ ఉండడంతో పార్టీ వర్గాలు సంతోషంలో ఉన్నాయి.

నెక్ట్స్ ఎవ‌రు..

కొల్లాపూర్‌లో కేడర్ ఉన్నప్పటికీ లీడర్ లేక మొన్నటి వరకు ఇబ్బంది పడ్డ కాంగ్రెస్‌కు ఇప్పుడున్న పరిణామాలు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. జూపల్లి తర్వాత ప్రతీసారి కొత్త ముఖాలు రావడం.. అధికార పార్టీలోకి వలస వెళ్లడం.. పరిపాటిగా మారింది. మరి వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందోననే అనుమానం ప్రజల్లో నెలకొంది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రతీ నియోజకవర్గంలో నాయకులను తయారుచేసే పనిలో ఉంది. పార్టీలో చేరిన జగదీశ్వర్ ,అభిలాష్ రావు ఇద్దరిలో టికెట్ ఎవరికి వస్తుంది.. టికెట్ రాని వర్గం మరొకరికి సహకరిస్తుందా.. వీరిద్దరూ కాకుండా ఎన్నికల నాటికి కొత్త ముఖం బరిలో ఉంటుందా.. అనే సందేహాలు కార్యకర్తల్లో మొదలయ్యాయి.