iDreamPost
iDreamPost
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 151 నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది. వాటిలో కర్నూలు జిల్లా కోడుమూరు ఒకటి. అప్పట్లో జగన్ వేవ్ కు తోడు అభ్యర్థి ఎంపికలో లోపాలు ఆ పార్టీని దెబ్బకొట్టాయి. నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులును అధిష్టానం అక్కడ పోటీ చేయించింది. స్థానిక శ్రేణుల సహాయ నిరాకరణతో ఓడిపోయిన ఆయన ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్రస్థాయి పదవితో ఏకంగా పార్టీ కార్యాలయంలో మకాం వేశారు. దాంతో ఎన్నికల సమయానికి ఆయన్ను మళ్లీ నియోజకవర్గానికి పంపుతారేమోనన్న ఆందోళన, అనుమానాలతో స్థానిక టీడీపీ నేతలు సతమతం అవుతున్నారు.
నాడు సహాయ నిరాకరణ
రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరుగా పనిచేసిన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి రామాంజనేయులు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందినవారు. గతంలోనే తన సతీమణిని అక్కడి నుంచి పోటీ చేయించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో తానే రంగంలోకి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మంత్రి లోకేష్ లతో ఉన్న సన్నిహిత్యంతో సర్వీసును కూడా పొడిగింపజేసుకున్న ఆయన.. 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే అధిష్టానం రామాంజనేయులుకు కోడుమూరు టికెట్ ఇచ్చింది. ఇది నియోజకవర్గ నేతలకు నచ్చలేదు. పార్టీ ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి.. టికెట్ ఆశించిన జెడ్పీ మాజీ చైర్మన్ ఆకుపోగు వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, ఆకుపోగు ప్రభాకర్ తదితరులు అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో నేరుగా రామాంజనేయులునే నిలదీశారు. అదే అసంతృప్తితో ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేశారు. దానికి వైఎస్సార్సీపీ గాలి తోడు కావడంతో రామాంజనేయులు ఓడిపోయారు.
రెండున్నరేళ్ల తర్వాత తెరపైకి
ఎన్నికల్లో ఓడిపోయిన రామాంజనేయులు అప్పటి నుంచీ నియోజకవర్గంలోనే కాకుండా.. జిల్లాలోనూ కనిపించకుండా పోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఒక్కసారైనా పాల్గొనలేదు. కానీ రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన్ను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించి.. మానవ వనరుల విభాగం ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో కోడుమూరు నేతల గుండెల్లో రాయి పడింది. గత ఎన్నికల్లో తమకు అవకాశం లేకుండా చేసిన ఆయన రాష్ట్రస్థాయి పదవిలోకి రావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి నియోజకవర్గంతో సంబంధం లేకపోయినా.. ఎన్నికల సమయానికి అధిష్టానం రామాంజనేయులుకే టికెట్ ఇచ్చి పంపితే తమ పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈసారి ఆయనకు అవకాశం ఇస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. అప్పటికీ అధిష్టానం స్పందించకపోతే మళ్లీ ఓడిస్తామని తేల్చి చెబుతున్నారు.
Also Read : Lokesh Challenges -లోకేష్ అంత సీరియస్ గా సవాళ్లు చేస్తున్నా..?